Saturday, September 21, 2024
HomeTrending Newsరష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్‌ ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం కలిగించిన ఈ యుద్ధం ఎలా ముగుస్తుందా అని ప్రపంచం ఆశతో ఎదురు చూస్తున్నది. కానీ, అది ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. పుతిన్‌గానీ, జెలెన్‌స్కీగానీ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. రష్యా ఓడితే అమెరికా, యూరప్‌ దేశాల పంతం నెరవేరినట్లవుతుంది. రష్యా ప్రభావం అంతర్జాతీయంగా తగ్గుతుంది. గెలిస్తే మాత్రం నాటోకు, రష్యాకు మధ్య కొత్త వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఫలితంగా మరిన్ని యుద్ధాలను ప్రపంచం చూడవలసి రావచ్చు.

ఇప్పటి వరకూ జరిగిన యుద్ధాన్ని పరిశీలిస్తే మాత్రం.. రష్యాను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ పోరాట పటిమ యావత్‌ ప్రపంచానికి తెలిసి వచ్చింది. రష్యా క్షిపణుల వర్షాన్ని, వైమానిక దాడుల్ని, ఆ దేశ సైనికులు జరిపిన దారుణ మారణాకాండను తట్టుకొని ఉక్రెయిన్‌ నిలబడటం మామూలు విషయం కాదు. దీనికి ప్రధాన కారణం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అతడి సారథ్యంలోని ప్రజలు, సైన్యం. మాతృభూమి రక్షణ కోసం రష్యాను అడుగడుగునా నిలువరిస్తూ పోరాడుతున్నారు. రష్యాను ఏకాకిని చేయటంలో, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టటంలో జెలెన్‌స్కీ విజయం సాధించారు. యూరప్‌ దేశాలు, అమెరికా అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ, ఆర్థికసాయం ఉక్రెయిన్‌ను యుద్ధరంగంలో నిలబెట్టగలిగాయి. రష్యాను బలహీనపరచటంలో ఆయా దేశాలు తమ ప్రయోజనాలను చూసుకుంటున్నాయి. కానీ, కాలం గడిచే కొద్దీ వాటి నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న సాయం కూడా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా పైచేయి సాధించి, ఉక్రెయిన్‌ను లొంగదీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే.

యుద్ధం ఉక్రెయిన్‌-రష్యాలకు ఎంత సంకట పరిస్థితులను నెలకొల్పిందో ప్రపంచ దేశాలకు కూడా అటువంటి పరిస్థితులనే కల్పించింది. సముద్ర రవాణా మార్గాలు, ఎగుమతులు, దిగుమతులు, చమురు సరఫరా వంటి కీలక రంగాలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం కలిగించింది. అసలే కరోనా కరాళనృత్యంతో అతలాకుతలమైన ప్రపంచంపై ఈ యుద్ధం.. మూలిగే నక్క మీద తాటిపండులా మారింది. పలు దేశాల్లో చమురు ధరలు, నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం అధికమై ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. ప్రపంచీకరణ యుగంలో ఒక దగ్గర సంభవించే పరిణామం మొత్తం ప్రపంచం మీద పడుతుందనడానికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఒక ఉదాహరణ. ఐక్యరాజ్యసమితి వంటి తటస్థ సంస్థల సామర్థ్యలేమికి కూడా ఈ పరిణామం ఒక సంకేతం. ఎంతటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే ప్రజాస్వామిక సూత్రం నేటికీ మాటలకే పరిమితమవుతున్నది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు చొరవ చూపి ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది.

Also Read : కొత్త ఏడాదిలో రష్యా సైన్యానికి పుతిన్ ఆఫర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్