దాదాపు 18 సంవత్సరాల తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇందుకోసం హైదరాబాద్ నగరం మొత్తం పార్టీ జెండాలు, బ్యానర్లతో పార్టీ శ్రేణులు అలంకరించాయి. భాగ్య నగరం కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ ఘనతను దాటేలా పోస్టర్లను బ్యానర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రతి సందు బీజేపీ అగ్రనేతల కటౌట్లు, బ్యానర్లతో అలంకరించారు.
జాతీయ కార్యవర్గానికి హాజరయ్యే ముందు సంపర్క్ అభియాన్ కోసం తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో పర్యటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు సూచించారు. దీంతో ఇప్పటికే మెజారిటి నియోజకవర్గాలకు నేతలు చేరుకొని సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో బిజెపి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని శతవిధాల ప్రయత్నం చేస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత కమలదలానికి కొంత పట్టున్న రాష్ట్రం కేవలం తెలంగాణానే. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర శ్రేణులు ఒంటి కాలి మీద లేస్తుంటే జాతీయ నాయకత్వం కూడా వారికి అండగా నిలుస్తోంది.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయ అగ్రనాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తోపాటు, కేంద్ర మంత్రులు, మూడు వందల అరవై మంది జాతీయ ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 2-3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకోవడం నేటి నుండి మొదలవుతుంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (జులై 1వ తేదీన) సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో, కార్యవర్గ సమావేశాల అజెండాను, సమావేశంలో చేయాల్సిన తీర్మానాలను గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జూలై 2వ తేదీన ఉదయం పదాధికారుల సమావేశం, అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 3 వ తేదీ సాయంత్రం ఐదు గంటల దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారు. ఆపై మూడవ తేదీన సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి బీజేపీ సత్తా చాటనున్నారు.