Babu in Trans: చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని, వాటి నుంచి ఇంకా బైట పడలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ప్రజలను మరోసారి వంచించడానికి బాబు ప్రయత్నిస్తున్నారని, తనకు బాకా ఊదే మీడియా సాయంతో ప్రజల మెదళ్ళలో విషబీజాలు నాటేందుకు తంటాలు పడుతున్నారని అన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని విజ్ఞప్తి చేశారు. గుంటుపల్లిలో జరిగిన వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా 1 లక్షా 60 వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు అందించామని వెల్లడించారు.
31 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళస్థలాలు పంపిణీ చేయడంతో పాటు, ఇళ్ళ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టామని, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయాన్ని కూడా తాము అమలు చేసి చూపామని వివరించారు. ప్రజల డబ్బుకు తాము ధర్మకర్తలం కానీ, ఓనర్లము కాదన్న విషయాన్ని సిఎం జగన్ ఎప్పటికప్పుడు చెబుతుంటారని, అందుకే ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేస్తుంటారని, పేదలకే అవి చెందేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా, ఆదాయం తగ్గించేలా టిడిపి అవసరమైన అన్ని కుట్రలూ చేస్తోందని సజ్జల ఆరోపించారు. మద్యంలో విషం ఉందంటూ ఇప్పుడు ఓ కొత్త ప్రచారం చేస్తున్నారని, ఇంతకంటే దిగజారుడు, అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, టిడిపి ఇతర విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని సజ్జల కోరారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని పిలుపు ఇచ్చారు.
Also Read : పవన్ మీడియేషన్: సజ్జల అనుమానం