డా. బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఓ ఆత్మగా, ప్రజాస్వామ్యానికి ఓ ప్రతిరూపంగా నిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం సమానత్వం దిశగా వడివడిగా అడుగులు వేసుకుంటూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంగా ఉన్నదంటే అది ఆయన వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో జరుగుతోన్న అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సజ్జల పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ కు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పుడు గర్వంగా చెప్పుకోవడమే కాదని, మరో వెయ్యేళ్ళ తరువాత కూడా అదే స్థాయిలో చెప్పుకుంటామని అన్నారు.
ప్రజాస్వామ్యం పరిపుష్టంగా ఉండాలంటే అసమానతలు పోవాలని.. అస్పృశ్యతకు గురైన వర్గాల నుంచి వచ్చి సమానత్వాన్ని… దానికి అవసరమైన మార్గాన్ని ప్రతిపాదించి, అందరినీ ఒప్పించి మన చేతిలో రాజ్యాంగం పెట్టారని, అందుకే మనం ఓ ఆరోగ్య కరమైన వ్యవస్థలో ఉన్నామని… రాజ్యాంగం ఆయన ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నామని వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగం మనకు ఉందంటే అది ఆయన చలవ మాత్రమేనని చెప్పారు. దళితుల ఆత్మా గౌరవానికి, ఆకాంక్షలకు, వారి హక్కుల కోసం పోరాడే స్పూర్తి కూడా ఆయన వల్లే సాధ్యమయ్యిందని, అందుకే అందరం ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ఓ మహోన్నత వ్యక్తి కీర్తి చరిత్రలో నిలబడే విధంగా స్మృతివనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని అమలు చేసిన ఘనత సిఎం జగన్ కు దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం ఎక్కడో ఓ మారుమూల ఎవరూ తిరగని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తే. సిఎం జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగా ఓ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని… దేశానికే గర్వకారణంగా నిలిచే ఈ స్మృతి వనం పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.