Is it right? నారాయణ అరెస్టుపై టిడిపి అధినేత, ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి దారుణమని, చంద్రబాబు అయితే ఏదో దేశ భక్తుడు అరెస్టయినట్లు రాద్దాంతం చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వారి వ్యవహారం చూస్తుంటే పదో తరగతి పేపర్ల మాల్ ప్రాక్టీస్ చేయడం తప్పే కాదన్నట్లుగా ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉండాలని వారు అనుకుంటే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఇందులో రాజకీయ కక్ష సాధిపు ఏమిటని నిలదీశారు. కేంద్ర హోం మంత్రి, గవర్నర్ వరకూ ఈ అంశంపై ఫిర్యాదులు చేశారని, దీన్ని ఓ అంతర్జాతీయ సమస్యలాగా హడావుడి చేశారని మండిపడ్డారు. బాబు నిన్నటి నుంచీ నిరంతరం దీనిపై పర్యవేక్షిస్తున్నారని, న్యాయకోవిదులతో చర్చిస్తూనే ఉన్నారని ఇది విడ్డూరంగా ఉందన్నారు. ఇదేదో దేశ ద్రోహానికి సంబంధించిన అంశం అయినట్లు బాబు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
పదో తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఉన్న ఆధారాలతోనే నారాయణ అరెస్టు జరిగిందన్నారు. నారాయణ విద్యా సంస్థలకు ఆయన ఛైర్మన్ కాదా, ఛైర్మన్ అయితేనే అరెస్టు చేయాలా అని ప్రశ్నించారు. వంద శాతం ఉత్తీర్ణత కోసమే ఇలాంటి పనులు చేశారని, మాల్ ప్రాక్టీసుకు పాల్పడి మళ్ళీ ఎదురు దాడి చేస్తున్నారని సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో కేవలం గ్రూపు సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరిస్తారని, పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలంటే సోషల్, తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతుంటామని ఈ కేసులో అరెస్టయినవారే చెప్పారని సజ్జల వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఉద్దేశ పూర్వకంగా కొంతమంది కావాలనే పేపర్ ఫోటో తీసి బైటకు పంపి దాన్ని షేర్ చేశారన్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి తంతు జరుగుతున్నట్లు వార్తలు ఉన్నాయని, గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల పరీక్షలు జరగలేదని, ఈ ఏడు దీనిపై తెలిసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని, దీనిలోభాగంగానే నారాయణ అరెస్టు జరిగిందన్నారు. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలతో కోర్టుకు వెళతామని, తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలీసులకు సిఎం జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అందుకే వారు చురుగ్గా కదిలి అరెస్టు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు ముగుసులో ఎన్నాళ్ళు తప్పించుకుంటారని సజ్జల ప్రశ్నించారు.
Also Read : సంబంధం ఉన్నందునే అరెస్ట్ : అంబటి