పబ్లిసిటీ కోసం పోరాటాలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. కెమెరా… స్టార్ట్ అనగానే యాక్షన్ చేయడానికి ఇది సినిమా కాదని, రాజకీయాలు అని అయన వ్యాఖ్యానించారు. వైసీపీతో ఏం తేల్చుకుంటారని, పదేళ్ళ నుంచే అయన ఏమి తేల్చారో అందరం చూస్తూనే ఉన్నామని, జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కు లేదని, స్థాయికి తాము దిగజారబోమని సజ్జల అన్నారు. అసలు అయన ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదన్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి రెండు, మూడు నెలలకోసారి వచ్చి హడావుడి చేయడం వల్ల ఉపయోగం ఉండదని, పార్టీ సిద్ధాంతాలు జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు.
కోవిడ్ నిబంధనల దృష్ట్యా తమతో సహా అందరికీ కొన్ని ఆంక్షలను పెట్టారని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు పెట్టారు తప్ప మరో ఉద్దేశం లేదని సజ్జల స్పష్టంచేశారు. ఈరోజు జరిగిన సిఎం కార్యక్రమానికి ఎంత మంది వచ్చారో చూసే ఉంటారని, తిరుపతి ఉపఎన్నికల సమయంలో కూడా తాను వస్తే ప్రజలు వేల సంఖ్య గుమిగూడతారనే జగన్ ప్రచారానికి కూడా వెళ్లలేదని అయన గుర్తు చేశారు.
ఇప్పటికే రోడ్ల మరమ్మతుల కోసం 2,200 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పూర్తయ్యాయని, వర్షాల్లో రోడ్లు బాగు చేసే పనులు చేపట్టడం సాధ్యం కాదు కాబట్టి, నవంబర్ నుంచి పనులు ప్రారంభం అవుతాయని వివరించారు సజ్జల. చంద్రబాబు గత ఐదేళ్ళ హయాంలో రోడ్ల రిపేర్లకు కనీసం వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని, రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు.
ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయిపోతుందా అంటూ పవన్ ను ఎద్దేవా చేశారు. కొండ ఎవరో ఎత్తుతుంటే చివరలో వేలు పెట్టి నేనే ఎత్తుతున్నాను అన్నట్లు పవన్ వ్యవహారం ఉందన్నారు.