Its voluntary- Sajjala on OTS:
పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటిఎస్ పథకం తీసుకువచ్చామని, దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం  చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఈ పథకం స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాం తప్ప ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అధికారులు ఈ పథకంపై ఆదేశాలు జారీ  చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోమని సజ్జల చెప్పారు. అలాంటి అధికారులు ప్రభుత్వానికి కావాలనే చెడ్డపేరు తెచ్చేందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉండి ఉంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపొతే క్రయ విక్రయాలకు, తమ వారసులకు హక్కుగా అందించడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉండదని, అందుకోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని…. సొంత ఆస్తి కావాలనుకునే వారికి ఇదో మంచి అవకాశమని, నామమాత్రంగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని సజ్జల వివరించారు.

తమ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తోందని, ఓ హక్కుగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరీ వారికి ఇళ్లు అందిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. గతంలో ఇళ్లు పొందినవారికి కూడా ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. పంచాయతీలకు పదివేలు, మున్సిపాలిటీలకు పదిహేనువేలు, కార్పోరేషన్ లో ఇరవైవేలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనిపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల విమర్శించారు.

చంద్రబాబు ఇప్పటికీ తాను ముఖ్యమంత్రిననే భ్రమలో ఉన్నారని, చట్టపరంగానే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని, లీగల్ ఒపినీయన్ తీసుకునే ఇలా చేస్తున్నామన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన వ్యక్తిగా తాను ఏదైనా మాట్లాడవచ్చని, అది తనకు జన్మ హక్కు అని చంద్రబాబు భావిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

Also Read : ఇవి మీకు ఉరితాళ్ళు : బాబు హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *