Navaratnaalu: ఐదేళ్ళ తరువాత 2027లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీని కూడా అధికారంలో ఉండే నిర్వహించు కుంటామని ఆ పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘కిక్ బాబు అవుట్- గెట్ ది పవర్ – అండ్ సర్వ్ ది పీపుల్’ అనే నినాదంతో, 175స్థానాలు గెల్చుకుంటామన్న విశ్వాసంతో తాము 2024 ఎన్నికలు వెళుతున్నామని చెప్పారు. మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో పార్లీ ప్లీనరీ నిర్వహించే ప్రాంతాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, మేకతోటి సుచరిత తదితరులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై నిర్వాహకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విజయసాయి మీడియాతో మాట్లాడారు. గతంలో ఇదే ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించుకున్నామని, దాని తర్వాత అధికారం చేజిక్కించుకున్నామని, మళ్ళీ ఐదు సవత్సరాల తర్వాత జూలై 8,9 తేదీల్లో మళ్ళీ ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని వివరించారు. ప్లీనరీలో కొన్ని తీర్మానాలతో పాటు పార్టీ నియమావళిలో కొన్ని సవరణలు కూడా తీసుకు రాబోతున్నామని, అధ్యక్షుల వారి ప్రారంభోపన్యాసంతో మొదలయ్యే ఈ సమావేశాలు రెండోరోజు ముగింపు సందేశంతో పూర్తవుతాయని చెప్పారు.
వైఎస్ జగన్ గత ప్లీనరీ లో ప్రకటించిన నవరత్నాలే వేదమంత్రంలా పాటిస్తున్నామని, దాన్నే తమ పార్టీ మేనిఫెస్టో లో కూడా పెట్టామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడేళ్ళలో 95 శాతం హామీలు తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇంత నిబద్ధత కలిగిన నాయకుడితో కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మూడేళ్ళ పాలనను సమీక్షించుకొని మరింత మెరుగైన రీతిలో ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే దానిపై చర్చిస్తామని వెల్లడించారు. ప్రజల అజెండాగానే తమ ప్లీనరీ జరుగుతుందన్నారు. చాలా కాలంపాటు తాము అధికారంలో కొనసాగాబోతున్నామని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ధ్యేయంగా విధానాలను నిర్దేశించుకుంటామన్నారు.
Also Read : జాబ్ మేళా నిరంతర ప్రక్రియ: విజయసాయి