Good Bye: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం తాను ఆడుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తన కెరీర్ లో చివరి టోర్నమెంట్ గా ఆమె వెల్లడించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో తొలి రౌండ్ లోనే సానియా జోడీ ఓటమి పాలైంది. ఆ వెంటనే ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. డబుల్స్ కెరీర్ లో ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెల్చుకున్నారు. 2013 నుంచి కేవలం డబుల్స్ కే పరిమితమయ్యారు.
తన నిర్ణయం వెనుక కొన్ని కారణాలున్నాయని, అంతా ఓకే కాబట్టి ఆడాలనేది సాధ్యం కావడం లేదని చెప్పారు. కొంత విరామం తర్వాత తిరిగి ఆట ప్రారంభించిన తనకు పూర్వపు ఫామ్ పొందడానికి సమయం పడుతోందని అభిప్రాయపడ్డారు. తాను వివిధ టోర్నీ లలో పాల్గొనేందుకు విదేశాలు తిరుగుతూ తన మూడేళ్ళ కొడుకును తన వెంట తిప్పుతూ చిన్నారిని కూడా రిస్క్ లో పెడుతున్నట్లు అనిపిస్తోందన్నారు సానియా.
‘నా శరీరం అలసిపోయింది. మోకాలి నొప్పి వేధిస్తోంది. కానీ నేటి ఓటమికి అదే కారణం కాదు, అయితే వయసు పెరుగుతున్న దృష్ట్యా ఆ నొప్పి నయం అయ్యేందుకు సమయం తీసుకుంటోంది’ అని తెలిపారు.
మహిళల డబుల్స్ లో వరల్డ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగిన సానియా కొన్నేళ్లుగా మెరుగైన ఆటతీరు ప్రదర్శించలేక పోతున్నారు. సింగిల్స్ విభాగంలోవరల్డ్ ర్యాంకింగ్స్ లో 27ను సానియా సాధించారు. ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణిగా పేరొందారు.