విశాఖ పోర్ట్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ను సోనోవాల్ ప్రారంభించారు. 600 ట్రక్ పార్కింగ్, కవర్డ్ స్టోర్ షెడ్ ల సౌకర్యంప్రపంచస్థాయి ప్రమాణాలతో దీన్ని నిర్మించామని తెలిపారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ది చేస్తున్నమని, ఆధునీకరణ, యాంత్రికరణతో మెరుగు పరుస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
కాలుష్య రహిత రవాణాను ప్రధానమంత్రి మోడీ ప్రోత్సహిస్తున్నారని, విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగానే కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మించామని చెప్పారు. ఏపీ ఎన్నో సహజ వనరులతో కూడిన రాష్ట్రమని, టూరిజం అభివృద్ధిలో ఈ క్రూయిజ్ నిర్మాణం దోహదం చేస్తుందన్నారు. సాగరమాల కార్యక్రమం కింద పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, పారిశ్రామికాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నారు.