Sarpavaram Narada Maharshi Temple :
నారద మహర్షి ముల్లోకాలను తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని రాబట్టేవాడు. ఆయా సంఘటనలు లోక కల్యాణానికి దారితీయడానికి ఆయన తనవంతు కృషి చేసేవాడు. “ఎలాంటి సంసార సంబంధమైన సమస్యలు లేకుండా ఎంత హాయిగా తిరుగుతున్నారో కదా”? అని ఆయనను చూసినవారు అనుకోవడం సహజం. అలాంటి నారద మహర్షి సైతం స్త్రీ గా మారిపోయి .. ఒక రాజును పెళ్లి చేసుకుని .. సంసార బంధాల్లో చిక్కి సతమతమైపోయిన సంఘటన గురించి తెలిస్తే ఎంతటివారైనా ఆశ్చర్యపోవలసిందే. అలాంటి అరుదైన సంఘటన జరిగిన క్షేత్రంగా ‘సర్పవరం’ కనిపిస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా ‘కాకినాడ‘ సమీపంలో ‘సర్పవరం’ దర్శనమిస్తుంది. పంచభావనారాయణస్వామి క్షేత్రాలలో ఇది ఒకటి. సువిశాలమైన ప్రదేశంలో .. ఎత్తయిన గోపురం .. పొడవైన ప్రాకారాలతో ఈ ఆలయం ప్రాచీన వైభవానికి అద్దంపడుతూ ఉంటుంది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర .. వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యాన్ని చాటుతున్నట్టుగా ఈ క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ఆలయ రాజగోపురానికి ఎదురుగా ‘నారద సరస్సు’ .. ‘ముక్తికా సరస్సు’ అనే రెండు సరస్సులు కనిపిస్తాయి. ఈ సరస్సులకు .. నారద మహర్షికి ముడిపడిన చరిత్ర మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.
Sarpavaram Narada Maharshi Temple :
పూర్వం దేవసభలో ‘విష్ణుమాయ’ గురించి ప్రస్తావన వస్తుంది. విష్ణుమాయను తెలుసుకోవడం ఎవరివలనా కాదనే విషయాన్ని బ్రహ్మదేవుడు ప్రస్తావిస్తాడు. అనుక్షణం నారాయణ నామ స్మరణ చేసే తనకి విష్ణుమాయ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదని నారదుడు కాస్తంత అహంభావాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట విని దేవతలంతా ఆశ్చర్యపోతారు. నారద మహర్షి ధోరణి విష్ణుమూర్తి వరకూ వెళుతుంది. తన మాయ ఎలా ఉంటుందనేది నారదుడికి కూడా చూపించాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుంటాడు.
ఆ తరువాత నారద మహర్షి లోక సంచారం చేస్తూ .. ఇప్పుడు ఈ క్షేత్రం ఉన్న ప్రదేశానికి వస్తాడు. అలసిన కారణంగా ఇక్కడ సరస్సులో స్నానం చేయాలని భావించి అందులోకి దిగుతాడు. అందులో మూడు మునకలు వేసి పైకి లేవగానే ఆయనకి స్త్రీ రూపం వచ్చేస్తుంది. అంతేకాదు .. తాను ఎవరు .. ఎక్కడి నుంచి వచ్చినది కూడా మరిచిపోతాడు. బయటికి వచ్చి తనకి తోచిన దిక్కుగా నడక మొదలుపెడతాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ‘నికుంఠమణి’ మహారాజు స్త్రీరూపంలోని నారదుడిని చూస్తాడు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది.
దాంతో ఆ మహారాజు ఆమెను తనతో పాటు రాజ్యానికి తీసుకువెళ్లి వివాహం చేసుకుంటాడు. వారికి 60మంది సంతానం కలుగుతారు. ఆ తరువాత జరిగిన ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు ఆ సంతానం కూడా చనిపోతారు. నారదస్త్రీ కన్నీటి పర్యంతమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వస్తాడు. తాను చెప్పినట్టుగా చేస్తే ఆమె ఆ దుఃఖం నుంచి బయపటపడుతుందని అంటాడు. ఇంతకుముందు నారద మాహర్షి స్నానం చేసిన ప్రదేశానికి నారదస్త్రీని తీసుకుని వస్తాడు. ముందుగా స్నానం చేసిన సరస్సు పక్కనే మరో సరస్సును సృష్టిస్తాడు. ఎడమచేయి పెకెత్తి ఆ సరస్సులో మునిగిలేవమని చెబుతాడు.
నారదస్త్రీ ఆ సరస్సులోకి దిగి అలాగే చేస్తుంది. దాంతో స్త్రీ రూపం పోయి పూర్వరూపం వస్తుంది. పూర్వజ్ఞానం కూడా కలుగుతుంది. అయితే పైకి ఎత్తిన చేతికి గాజులు అలాగే ఉంటాయి. ఒడ్డున చూస్తే బ్రాహ్మణుడు కనిపించడు. అప్పుడు తనకి గుణపాఠం చెప్పడానికే విష్ణుమూర్తి ఇలా చేశాడని నారద మహర్షి భావిస్తాడు. ముందుగా అక్కడికి సమీపంలో పాతాళ మార్గంలో వెలసిన భావనారాయణ స్వామి సన్నిధిలో తపస్సు చేసి తన ఎడమచేయి గాజులు తొలగిపోయేలా చేసుకుంటాడు. అందుకు కృతజ్ఞతగా ఆ పక్కనే రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి మూర్తిని ప్రతిష్ఠ చేస్తాడు.
నారదమహర్షిచే పూజలందుకున్న పాతాళ భావనారాయణుడు, సర్పరాజైన అనంతుడి కోసం స్వయంభువుగా వెలసిన స్వామి. అలా జరగడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం పరీక్షిత్తు మహారాజు సర్పం కాటు వలన మరణించడంతో, ఆ కోపంతో జనమేజయ మహారాజు ‘సర్పయాగం’ చేస్తాడు. మహా మహ సర్పాలన్నీ కూడా యాగానికి ఆహుతి కాసాగాయి. అప్పుడు సర్పరాజైన అనంతుడు శ్రీమహావిష్ణువును మనసునందు భావన చేసుకోగా స్వామి గరుడవాహనంపై ప్రత్యక్షమవుతాడు. సర్పజాతిను రక్షిస్తానని అభయం ఇవ్వడమే కాకుండా, మానవాళిచే సర్పాలు పూజలు అందుకునేలా వరాన్ని ప్రసాదిస్తాడు. సర్పాలు వరాన్ని పొందిన కారణంగా ఈ క్షేత్రానికి ‘సర్పవరం’ అనే పేరు వచ్చింది.
కాశీ నగరం నుంచి వచ్చేసిన వ్యాస మహర్షి ఈ క్షేత్ర దర్శనం చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీనాథుడి ‘కాశీ ఖండం’ .. ‘భీమఖండం’లోను ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీనిని బట్టి ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనదనేది అర్థం చేసుకోవచ్చును. ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్లు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ప్రాకార మంటపాలు ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. విశాలమైన ప్రదక్షిణ మార్గంతో పాటు ఉత్తర ద్వారాన్ని కలిగి ఉండటం విశేషం. చోళులు .. చాళుక్యులు .. పాండ్యులు .. రెడ్డిరాజులు కాలంలో ఈ క్షేత్ర వైభవం పెరుగుతూ వెళ్లింది. అందుకు నిదర్శనంగా ఇక్కడ మనకు అనేక శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తర రాజగోపురాన్ని ‘పిఠాపురం’ రాజావారు నిర్మించారు.
ముందుగా ప్రదక్షిణ మార్గంలో కొన్ని మెట్లు లోపలికి దిగివెళ్లి ‘పాతాళ భావనారాయణ స్వామి’ దర్శనం చేసుకున్న భక్తులు, ఆ తరువాత ప్రదక్షిణ పూర్తిచేసి ముఖమంటపం ఎదురుగా ఉన్న ‘రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి’ దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత ఉపాలయాలను దర్శిస్తారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ‘వైఖానస ఆగమం’ ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి. ‘వైశాఖ శుద్ధ ఏకాదశి’ రోజున స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక మాఘమాసంలో ఆదివారాల్లో ఇక్కడ జరిగే తీర్థానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాల్లోను ప్రత్యేకమైన పూజలు .. వాహన సేవలు నిర్వహిస్తారు. నారదుడు ముందుగా స్నానం చేసిన సరస్సు ‘నారద సరస్సు’గా .. ఆయన రెండవసారి స్నానం చేసి స్త్రీ రూపం నుంచి విమోచనాన్ని పొందిన సరస్సు ‘ముక్తికా సరస్సు’గా పిలవబడుతూ ఇప్పటికీ మనకి ఇక్కడ పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి.
సర్ప రాజైన అనంతుడికి స్వామి గరుడవాహనంపై ప్రత్యక్షమైన క్షేత్రం .. రాజ్యలక్ష్మీ సమేతుడైన భావనారాయణస్వామిని నారద మహర్షి ప్రతిష్ఠించిన క్షేత్రం .. లక్ష్మీదేవి అమ్మవారి మూర్తిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన క్షేత్రం .. ఎంతోమంది రాజులు .. రాణులు సేవించిన క్షేత్రం .. స్వామివారి మహిమలు భక్తుల అనుభవాలుగా వినిపించే క్షేత్రం .. ‘సర్పవరం’. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన 108 దివ్య తిరుపతులను దర్శించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్వామివారి సౌందర్యాన్ని చూసితీరవలసిందే! పదే పదే తలచుకుని తరించవలసిందే.
– పెద్దింటి గోపీకృష్ణ
Must Read : శ్వాసించే నరసింహుడు .. తలనిండుగా నీళ్లతో శివుడు