Single Card: ఈమధ్య ఏది ట్రెండింగ్ లో ఉందో దాని మీద రాయమని మా డిజిటల్ టీం అడగడం ఎక్కువయ్యింది. మనసుకు నచ్చిన, లేదా మనం బాగా రాయగలమనుకున్న విషయం మొదలుపెడితే వెంటనే లాగించేయచ్చు. ఇప్పుడు పాఠకుల డిమాండ్లు కూడా ఎక్కువవుతున్నాయి. పాఠకులు దేవుళ్లు, అంతిమ నిర్ణేతలు కాబట్టి…ఫలానా విషయం మీద రాయండి అన్న వారి ప్రేమపూర్వక ఆదేశాన్ని మన్నించాల్సిందే.
ఒక యువకుడు ఇద్దరితో సహజీవనం చేస్తూ…చివరికి ఒకే వేదిక మీద ఆ ఇద్దరి మెడలో తాళులు కట్టడంతో శుభం కార్డు పడ్డ లోకోత్తర పెళ్లి గురించి రాయలేదేమిటని అనేక మంది పాఠకులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే లోపు…ఒకాయన నాలుగో సారి తాళి కట్టి పవిత్ర బంధంలోకి ఎంటరయిన వీడియో వచ్చింది. దీనిమీద ఏమి రాస్తున్నారు? అని బాధ్యతగల పాఠకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యం నిలబడేదే ప్రశ్నలు- సమాధానాల మీద కాబట్టి ప్రశ్నలను గౌరవించాల్సిందే.
ఒకబ్బాయి కాలేజీలో ఏకకాలంలో ఇద్దరమ్మాయిలను ప్రేమించాడు. ఇద్దరితో సహజీవనం చేశాడు. ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత ఇద్దరినీ ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి పత్రిక ఇది.
పెళ్లి పత్రిక, దాని నేపథ్యం, ఊరు, పేర్లు అంతా మంగళకరంగా మూలలకు పూసిన పసుపుతో పాటు సెల్ఫ్ ఎక్స్ప్లెనెటరీగా ఉంది. దీని మీద ఏమి రాసినా వారి మనోభావాలు దెబ్బ తింటాయి. శుభమా అని అత్యంత ధైర్య సాహసాలతో అతను ఏకకాలంలో ఇద్దరి మెడలో తాళులు కడితే అది-
ధైర్య సాహసాల ప్రదర్శనకు సంబంధించిన విన్యాసంగా కొందరు;
బాగా శాస్తి జరిగిందని కొందరు;
తిక్క కుదిరిందని కొందరు;
ఇదే ప్రమాణంతో మిగిలిన సహజీవనాలు కూడా ముందుకొచ్చి మెడల్లో తాళులు వేసుకోవాలని కొందరు;
అమ్మాయిల కుటుంబాలవారు ఎలా ఒప్పుకున్నారని కొందరు;
అసలు అమ్మాయిలు ఎలా అంగీకరించారని కొందరు;
ఈ పత్రిక సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తోందని కొందరు…
ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. నోరెళ్లబెడుతున్నారు.
ఎవరేమన్నా-
సత్తెంగా ఒక సత్తిబాబు వివాహం ఒక స్వప్న కుమారి, ఒక సునీతతో సహజీవన సంతాన ఫలశ్రుతిగా శాస్త్రీయంగా జరిగింది. అమ్మాయిల తల్లిదండ్రుల్లా…ఇరువురితో సత్తిబాబు బాగుండాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముంది ఇందులో?
ఇక రెండోది-
పవిత్ర బంధం అంటే వ్యుత్పత్తి అర్థం చెప్పవచ్చు కానీ…లోకంలో జరిగేవాటికి అన్వయించి చెప్పడం కష్టం.
ఒకటి…రెండు…మూడు…నాలుగు…ఎన్నయినా పవిత్రమే.
న్యాయం చట్టానికి లోబడి ఉండాలి.
చట్టం న్యాయసమీక్షకు నిలబడాలి.
ధర్మం సంఘ పరీక్షకు నిలబడాలి.
సంఘం ధర్మానికి కట్టుబడి ఉండాలి.
అర్థం కాలేదు కదా?
అంతే…
కొన్ని అర్థం కాకపోవడమే మన ఆరోగ్యాలకు మంచిది!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :
Also Read :
Also Read :