షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సభ్య దేశాలు అన్నీ పరస్పరం సహకరించుకోవాలని, ఒకరిపై ఒకరు నమ్మకంతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇండియా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. శుక్రవారం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ లో జరిగిన 22వ ఎస్సీవో సమిట్ లో మోడీ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌కు ఆటంకం ఏర్పడిందని, చాలా దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తిందని మోడీ అన్నారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే మిల్లెట్ల(తృణధాన్యాలు) సాగు, వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. తృణధాన్యాల పంటలే ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు పరిష్కారమన్నారు. ఎస్సీవో ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆసియాలో సప్లై చైన్ నిరంతరం కొనసాగేలా సభ్య దేశాలన్నీ ఒకరికొకరు పూర్తిస్థాయిలో ట్రాన్సిట్ యాక్సెస్ ఇచ్చుకోవాలన్నారు. టూ వే ట్రేడ్ ను బంద్ పెట్టిన పాకిస్తాన్ తీరును ఇలా ప్రధాని పరోక్షంగా తప్పుపట్టారు.
లడఖ్ లోని గల్వాన్ లోయలో ఇండియా, చైనా ఆర్మీ మధ్య గొడవ, ఆ తర్వాత వరుసగా బార్డర్ టెన్షన్లు నెలకొంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ రెండేండ్ల తర్వాత ముఖాముఖి ఎస్సీవో సమిట్‌లో కలుసుకున్నారు. అయితే, ఇద్దరు నేతలూ పలకరించుకోకుండా దూరం పాటించారు. పక్కపక్కనే నిలబడి ఫొటోలు దిగినా.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకపోవడం, కనీసం చిరునవ్వులతో సైతం పలకరించుకోకపోవడం చర్చనీయాంశం అయింది.
ఎస్సీవో సమిట్ సందర్భంగా ప్రధాని మోడీ టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌకత్ మీర్జియోయేవ్ తోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఎర్డోగన్ తో భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను రివ్యూ చేసిన ఇరువురు నేతలు.. వివిధ రంగాల్లో సహకారం మరింత పెంచుకోవడంపై చర్చించారు. ఇక గల్ఫ్ లో ఇండియాకు మంచి సహకారం అందిస్తున్న ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీంతోనూ మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
సమర్కండ్లో జరిగిన 22వ ఎస్సీవో సమిట్‌కు ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌకత్ మిర్జియోయేవ్ అధ్యక్షత వహించారు. సమిట్ ముగింపు సందర్భంగా ఆయన ఎస్సీవో ప్రెసిడెన్సీ బాధ్యతలను ఇండియాకు అప్పగించారు. 2023లో జరిగే ఎస్సీవో సమిట్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
షాంఘై సహకార సహకార సంస్థ సదస్సు (SCO Summit) ఉజ్బెకిస్థాన్‌లో సమర్ఖండ్లో కొనసాగుతోన్న సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ పలు విషయాలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధంపై భారత వైఖరి ఏంటో ప్రధాని మోదీ మరోసారి చెప్పకనే చెప్పారు. గతంలో పుతిన్‌తో మాట్లాడిన వ్యాఖ్యలను సైతం ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘యుద్ధానికి ఇది సమయం కాదు’ అని పుతిన్‌కు సూచించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ.. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించాలని చూస్తున్నానని తెలిపారు. ఈ సంక్షోభం విషయంలో ఇండియాకు ఉన్న ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. అయితే, ఉక్రెయిన్ నాయకత్వం చర్చల ప్రక్రియను తిరస్కరించిందని, యుద్ధరంగంలో పోరాటం ద్వారానే లక్ష్యాలను సాధించాలని వాళ్లు కోరుకుంటున్నారని అన్నారు. అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపైనా మోడీ, పుతిన్ చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Also Read : కేంద్రం కీలక నిర్ణయం… త్వరలోనే 5జీ సేవలు