రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో మొదట నేతలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్ గౌసియా బేగంకు నేతలు సీఎం పినరయి విజనయ్, అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్, సీఎం కేసీఆర్, అఖిలేశ్ యాదవ్, డీ రాజా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.
రాష్ట్రంలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజేశారు. సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్ల నిమిత్తం మరికొందరిని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు సిఫారస్ చేశారు. తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టింది. రెండో విడత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్‌లో విస్తృత ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమ వివరాలు తెలిసేలా శిబిరాలను సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్‌ను స్టాల్స్ వారీగా నెలకొల్పారు