Sunday, January 19, 2025
HomeTrending Newsసచివాలయ పనులపై సిఎంసమీక్ష

సచివాలయ పనులపై సిఎంసమీక్ష

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తత పై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు

ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతి పై సిఎం కెసిఆర్ సమీక్షించారు.

అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. గత రివ్యూ సందర్భంగా సిఎం చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సిఎం కు నివేదించారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా వున్నాయని అధికారులు సిఎం కు వివరించారు.

సెక్రటేరియట్ పనులన్నీ సమాంతరంగా వేగంగా సాగాలి : సిఎం

నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సిఎం సూచించారు.

సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్ననేపథ్యంలో పోలీసు శాఖకు కావాల్సిన వసతులు తదితర అంశాలపై డిజిపి మహేందర్ రెడ్డి తో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సిఎం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్