Saturday, June 29, 2024
HomeTrending Newsపంజాబ్, కాశ్మీర్ లో కొత్త సంకేతాలు

పంజాబ్, కాశ్మీర్ లో కొత్త సంకేతాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశమంతా విపులంగా చర్చలు జరుగుతున్నాయి. 18వ లోక్‌స‌భ కొలువుదీర‌డం ఒక్క‌టే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీయేకు తగ్గిన మెజారిటీ, ఇండియా కూటమికి పెరిగిన సీట్ల మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి. సందట్లో సడే మియా అన్నట్టుగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు స్వతంత్రులు గెలిచారు.

పంజాబ్ లోని ఫరీద్ కోట్ నుంచి సరబ్జిత్ సింగ్, ఖద్దుర్ సాహిబ్ నుంచి అమృత్ పాల్, కాశ్మీర్ లోని బారాముల్లా నుంచి షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ (ఇంజినీర్‌ రషీద్‌) విజయం సాధించారు. గెలిచిన ముగ్గురు వేర్పావాద భావాలు కలిగిన వారు కాగా ఇద్దరు జైలు నుంచి పోటీ చేసి గెలిచారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 40 ఏండ్ల క్రితం హత్య చేసిన కేసులో దోషి బియాంత్‌ సింగ్‌… ఆయన కుమారుడు పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సరబ్జీత్‌ సింగ్‌ ఖల్సా 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1984, అక్టోబర్‌ 31న ఇందిరాగాంధీని హతమార్చిన ఇద్దరు హంతకుల్లో బియాంత్‌ సింగ్‌ ఒకరు. సరబ్జీత్‌ గతంలో బీఎస్పీ నుంచి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు.

అమృత్ పాల్ జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద 2023లో అరెస్టు అయ్యారు. ప్ర‌స్తుతం అసోంలోని దిబ్రూగ‌ఢ్ జైల్లో ఉన్నారు. అమృత్ పాల్ ను అరెస్టు చేస్తే ఆయన మద్దతుదారులు పోలీసు స్టేషన్ పై దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించారు. దీంతో ఆయనను అరెస్టు చేసి అస్సాం జైల్లో ఉంచారు.

ఇంజినీర్ అబ్దుల్ ర‌షీద్ ఉగ్ర కార్య‌కలాపాల‌కు నిధులు స‌మ‌కూర్చార‌న్న అభియోగాల‌పై 2019లో అరెస్టు అయ్యారు. ఈయ‌న తీహార్ జైల్లో ఉన్నారు. మే 20న బారాముల్లాలో వోటింగ్ జరగగా 2019లో 35% పోలింగ్ జరిగితే ఈ దఫా 58% పోలింగ్ నమోదైంది. ప్రజలు ప్రాజస్వామ్యం వైపు మొగ్గు చూపుతున్నారని అందరు అంచనా వేశారు. బారులు తీరి ఓటు వేసిన ప్రజల మనోగతం మరోలా ఉంది.

అమృత్ పాల్, అబ్దుల్ రషీద్ లపై ఉన్న అభియోగాలు రుజువు కావటం జరిగితే ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉండ‌డానికి అన‌ర్హుల‌వుతారు. అప్పుడు లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని కోల్పోతారు. జైలు శిక్ష కాలంతో పాటు మ‌రో ఆరేండ్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండ‌దు. ప్ర‌జాప్ర‌తినిధులు దోషులుగా తేలిన వెంట‌నే అన‌ర్హులుగా ప‌రిగ‌ణించాల‌ని 2013లో సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

రాజ్యాంగ నిబంధ‌న‌ల ప్ర‌కారం లోక్‌స‌భ‌కు వెళ్లి ప్ర‌మాణం చేసేందుకు అర్హులేన‌ని రాజ్యాంగ నిపుణులు చెపుతున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచిన వ్య‌క్తి చ‌ట్ట స‌భ్యుడిగా ప్ర‌మాణం చేయ‌డం అనేది రాజ్యాంగప‌ర‌మైన హ‌క్కు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ జైల్లో ఉన్నందున ప్ర‌మాణ‌స్వీకారం కోసం పార్ల‌మెంట్‌కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ప్ర‌మాణ‌స్వీకారం పూర్త‌యిన త‌ర్వాత తిరిగి జైలుకు త‌ర‌లించొచ్చని సమాచారం.

మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న వ్య‌క్తులు స‌భా కార్య‌క‌లాపాల‌కు హాజ‌ర‌య్యేందుకు చ‌ట్టం అనుమ‌తించ‌దు. కాబ‌ట్టి ఎంపీగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత వారు స‌భ‌కు హాజ‌రు కాలేక‌పోవ‌డంపై స్పీక‌ర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్య‌ర్థ‌న‌ల‌ను స‌భ్యుల గైర్హాజ‌రీపై ఏర్పాటైన హౌస్ క‌మిటీకి నివేదిస్తారు. ఈ అభ్య‌ర్థుల‌ను అంగీక‌రించాలా..? వ‌ద్దా..? అన్న‌దానిపై క‌మిటీ సిఫార్సులు… వాటిపై స‌భ‌లో ఓటింగ్ నిర్వ‌హించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇద్దరు స్వతంత్రులు జైలు నుంచి పోటీ చేసినా కూడా 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ముగ్గురు స్వతంత్రుల గెలుపు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవిదంగా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్