7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending News'సమైక్యతా' విమోచన'రణం'

‘సమైక్యతా’ విమోచన’రణం’

తెలంగాణ విమోచనం కేంద్రానికి గుర్తొస్తే…. జాతీయ సమైక్యతా రాగం రాష్ట్ర ప్రభుత్వం ఆలపిస్తోంది. రివర్స్ పంచ్ ఏమిటని ఆలోచిస్తున్నారా… అవును అదే జరగబోతోంది. తెలంగాణ విమోచనదినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిస్తే, అదే రోజును జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చిత్ర విచిత్ర నిర్ణయాల వెనుక దాగివున్నది అంతా రాజకీయమే.ఔనన్నా,కాదన్నా జరుగుతున్నది జరగబోతున్నదీ అదే.

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజు.కర్ణాటక, మహారాష్ట్ర లోని పది ప్రాంతాలను కలుపుకుని తెలంగాణ లో నిజాం పాలన కొనసాగింది. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య వస్తే ఆరోజు తెలంగాణ ప్రాంతానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. నిజాం పాలనలో వున్న హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కాలేదు.అయితే అప్పటికే నిజాం నిరంకుశ పాలనకు , నిజాం మద్దతుతో రజాకార్లు సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం కొనసాగుతోంది. ప్రజా పోరాటాలు కొనసాగుతుండగానే , దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత కేంద్రంలో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలో దిగి నిజాం రాజును దిగివచ్చేలా చేశాయి. 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైంది. అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది. ఏదైయితేనేం నిజాం పాలన నుంచి ప్రజలు విమోచనం పొందారు. మరి ఆరోజున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి అభ్యంతరం ఏంటి? అక్కడే వుంది మతలబు. అప్పుడే రాజకీయాలు కూడా రాజుకున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయం పక్కన పెట్టారు. అదును కోసం ఎదురు చూస్తున్న బీజేపీ కేసీఆర్ పై విమర్శలకు పదును పెట్టింది. మజ్లిస్ (ఎం ఐ ఎం) కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చింది. 2014 నుంచి ఇదే తంతు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఇద్దరి మధ్య పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తీర్మానించడం, అందుకు తగ్గట్టుగా హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తుండటం తాజా వివాదానికి కారణమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. అక్కడిదాకా బాగానే వున్నా బీజేపీ మాస్టర్ ప్లాన్ తో టీఆర్ఎస్ లో ప్రకంపనలు మొదలైయ్యాయి.

మునుగోడు ఉపఎన్నిక, రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సెంటిమెంట్ తో గులాబీ పార్టీ ని దెబ్బకొట్టాలని కమలం పార్టీ గట్టి పన్నాగమే వేసింది. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, అదే కేసీఆర్ నిర్వహించడం లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా బీజేపీ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ వాదిస్తూ అధికార టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది. ఓం రకంగా ఓట్ల రాజకీయాలు తెరమీదకు వచ్చాయి.

ఇదంతా రాజకీయ వివాదంగా మారిన వేళ టీఆర్ఎస్ కూడా దూకుడు పెంచి కొత్త పల్లవి అందుకుంది.సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అంతేకాకుండా ఈ నెల 16,17,18 తేదీల్లో జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాల్లో భాగంగా వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని కూడా కేబినెట్ నిర్ణ‌యించింది. వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా ప్రారంభ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు సిద్దమైంది. అటు ఎం ఐ ఎం కూడా అడుగు ముందుకు వేసి సెప్టెంబర్ 17 న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరపాలని, తాము కూడా హైదరాబాద్ పాతబస్తీలో భారీ సభ ఏర్పాటు చేసి, తిరంగా ర్యాలీ చేపడతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాసింది.ఇటు టీఆర్ఎస్, ఎం ఐ ఎం లు సమైక్యతా రాగం అందుకోగా, బీజేపీ విమోచన దినోత్సవం గా జరుపుకుంటోంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో ముస్లీంల భాగస్వామ్యం కూడా ఉందన్నది ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ వాదన. అది హిందూ, ముస్లీం పోరాటం కాదని ఆయన సెలవిచ్చారు.

ఏదైనా పోటా పోటీ రాజకీయానికి తెలంగాణ విమోచనా దినోత్సవం వేదికవుతోంది. ఈ వ్యవహారం టీఆర్ఎస్, బీజేపీ లలో ఎవరికి లాభిస్తుందో , తెలియదుగానీ, కాంగ్రెస్ మాత్రం ఆ రెండు పార్టీలు ప్రజల మనోభావాలతో ఆటాడుకుంటున్నాయంటూ విరుచుకు పడుతోంది. ఎంఐఎం అడుగుజాడల్లో నే అధికార గులాబీ పార్టీ నడుస్తోందని దానికి వారి నిర్ణయాలే అద్దం పడుతున్నాయని కాషాయ పార్టీ గట్టి గానే వాదిస్తోంది.

మరి తెలంగాణ విమోచన దినోత్సవం ఎవరికి వరంగా మారుతుంది? ఎవరికి శాపమవుతుందో గానీ, ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు మాత్రం పేలుతున్నాయి. ఎన్నికలే ప్రామాణికం కాకుండా ప్రజల మనోభావాలను అన్ని పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ విమోచన రాజకీయ రణ రంగంలో ప్రజలు మాత్రం పావులు కాకూడదు. విమోచనమో,విలీనమో అంతా సమైక్యంగా జరిగితే బాగుంటుందేమో….. చూద్దాం మరి

వెలది. కృష్ణ కుమార్

Also Read : అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్