తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన పాపానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం’ మొత్తం పక్క రాష్ట్రానికి తరలిపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్లు సోకు రాజకీయాలు చేస్తున్నారని, దొర తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక మహారాష్ట్రకా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా..బందిపోట్లలాగా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజానికం బీఆర్ఎస్ దుర్మార్గాలను గుర్తించాలని కోరారు.
ప్రజలను గాలికొదిలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్లిందంటే..తెలంగాణపై కేసీఆర్ కున్న చిత్తశుద్ధి ఏంటో గమనించాలని షర్మిల అన్నారు. వెళ్లే దారిలో కూడా ఇక్కడి ప్రజలను అవస్థలకు గురిచేసిన దొంగలు ఈ బీఆర్ఎస్ నేతలని, రాష్ట్రంలో పాలన అటకెక్కింది, వ్యవస్థలన్నీ శూన్యంగా మారాయన్నారు. మన గ్రామాలు సందర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి తీరిక లేదు కానీ రాజకీయాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే సమయం మాత్రం ఉందన్నారు. ఇక్కడ తిరిగి సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు..పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండన్నారు. రాజకీయాలకు రంగులు మార్చే ఈ బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే తరిమికొట్టాలని షర్మిల పిలుపు ఇచ్చారు.