Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు అక్షరాలు సులభంగా నేర్చుకోవడానికి...

తెలుగు అక్షరాలు సులభంగా నేర్చుకోవడానికి…

దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప. ఇంకో అయిదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరయినా విడమరచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు.

కనీసం ఇంకో పది వేల సంవత్సరాలయినా బతికి, బట్ట కట్టి, బలుసాకయినా తిని, నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్న మాట నిజమే అయినా-ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిది అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. ఖచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది? అని తేల్చడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతుంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.

మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా ఇప్పుడు లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపి అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.

ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది. ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తాయి.

తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తుంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.

“బాగున్నారా? పది గంటలకే నిద్రలేచి అప్పుడే మెసేజులు చూస్తున్నారా?”
అని తెలుగులో అఘోరించకూడదు.
దీన్ని-
“Bagunnara?
Padi gantalake nidra lechi appude mesejulu chustunnara?”

అని ఇంగ్లిష్ లిపిలో రాస్తేనే ఆధునికులం. ట్రెండీ. కొత్తతరంతో మనం కూడా పరుగులు తీస్తున్నట్లు. ఇలా రాయడంవల్ల లండన్ లో షేక్స్ పియర్లు, అమెరికాలో నోమ్ చాస్కీలు మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు. తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు. లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమయిన పాపం మూటగట్టుకుంటున్నారు. మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు.

పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది. దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోతుంది. ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజ్ లన్నీ ఇలా ఇంగ్లీషు లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగం.

కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఇంగ్లిష్ లో ఒక మాట ఉంది. రెండో కంటికి తెలియకుండా తడి గుడ్డతో గొంతు కోయడం. చుక్క రక్తం చిందకుండా గుండె కోయడం. అలా మనం తెలుగు లిపిని నిశ్శబ్దంగా హత్య చేస్తున్నాం. ఇన్నాళ్లు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటే ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు కూడా తోడయ్యాయి.
“The Bigbasket promise.
Prati Roju Takkuva Dharalaku”
లాంటివి ప్రతిరోజూ లెక్కలేనన్ని ప్రకటనలు.
ప్రతి రోజూ తక్కువ ధరలకు అని తెలుగులో రాస్తే జైల్లో పెడతారని భయపడి ఇంగ్లీషులో రాసినట్లున్నారు. ఇలా రాయడం వల్ల ఒకే సమయంలో నిరక్షరకుక్షులమయిన మనకు రెండు భాషలు నేర్పుతున్నామని వారు అనుకుంటూ ఉంటే- వారి పాద ధూళి కోసం మనం ప్రయత్నించాల్సిందే.

మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది. మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది. మనకు మనమే నిరక్షరులుగా మిగిలే దైన్యం మనది. తెలుగు అక్షరం గుక్క పట్టి ఏడుస్తున్నా వినిపించుకోని పుట్టు చెవుడు మనది. తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్నా చూడలేని పుట్టు వైకల్యం మనది. తెలుగు పట్టని వైక్లబ్యం మనది.

ఎవ్వరూ భయపడకండి. తెలుగును నడి బజారులో పట్ట పగలు అందరు చూస్తుండగా ఖునీ చేసినా ఎవరూ కేసులు పెట్టరు. పెట్టినా నిలబడవు. నిలబడినా శిక్ష పడదు. పడినా అమలు కాదు.
త్వరగా పిడికిలి బిగించి ఉరికి రండి!
తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికి రండి!
తెలుగును కసితీరా పొడిచి పొడిచి చంపేద్దాం.
తెలుగును తెలుగు లిపిలో రాస్తే- అమ్మ భాష.
తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే- Amma Mogudi Bhasha.

ఇంతటి నైరాశ్యంలో కూడా మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం అన్నట్లు- కోటికొక్కరు తెలుగు అక్షరాలను పొదివి పట్టుకుని…ముందు తరాలకు అందించడానికి; తెలుగు అక్షరాల అందాన్ని ఆవిష్కరించి కళ్లకు విందు చేయడానికి; పలికి చెవులకు పండగ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

అలా పుస్తకం తెరవగానే తెలుగు అక్షరాలు మన ముందుకు దూసుకువచ్చినట్లు తెలుగు భాషాభిమాని శశి గూడూరు ఒక “కళాక్షరిక” తయారు చేశారు. ఐ ఐ టీ బాంబేలో దృశ్య సమాచార- విజువల్ కమ్యూనికేషన్స్ లో పి జి చేసిన శశి మనసంతా తెలుగే. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు వర్ణమాల మీద చిన్న పిల్లలకు ఉత్సాహం కలిగేలా ఇదివరకే ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి…పేరు తెచ్చుకున్నారు. “టైపోవనం” వ్యవస్థాపకుడిగా ఆయన తెలుగు భాషా పరిరక్షణ స్పృహ ఉన్న వర్గాలకు దగ్గరివారు. ఒకప్పుడు తెలుగు అక్షరాలను పలకల మీద దిద్దుకుంటూ నేర్చుకున్నాం. ఇప్పటికీ అదే అత్యుత్తమమైన పద్ధతి. ఇంత సాంకేతికత పెరిగిన రోజుల్లో అక్షరాలు దిద్దుకునే పద్ధతికి ప్రత్యమ్నాయం కనుక్కోవాలి- అన్న శశి ఆలోచనకు ఈ “కళాక్షరిక” ప్రతిరూపం. ఈ అక్షరాలను తాకవచ్చు. పదే పదే మూసి…తెరుస్తుంటే…ఆ అక్షరం పేజిలోనుండి సీతాకోకచిలుకలా మన కళ్లముందు ఎగురుతున్న అనుభూతి కలుగుతుంది. అక్షయమైన తెలుగు అక్షరం క్షయం కాకుండా ఉంచడానికి ఉపయోగపడే మంచి ప్రయత్నం. తెలుగు భాషాభిమానులందరూ శశిని నిండు మనసుతో అభినందించాలి.

ఇలాంటివి ఎంత రాసినా, ఎంతగా మాటల్లో చెప్పినా ప్రత్యక్షంగా చూస్తే తప్ప అర్థం కావు. ఆ ‘కళాక్షరిక’ పుస్తకం తెరిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో లింక్ లో చూడగలరు.

(శశి గూడూరు ఫోన్ 98857 33717)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్