కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించటం శుభపరిణామం అని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని నిరాకరించటం నిరాశగా ఉన్నా… అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించటం ద్వారా పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం వస్తుందన్నారు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారా అనే ప్రశ్నకు శశిథరూర్ మాట దాటవేశారు. తిరువనంతపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్నపుడు ఎంపి థరూర్ వైఖరి చూస్తుంటే పోటీకి ఆసక్తిగా ఉన్నారని అవగతమవుతోంది.
ఇటీవల మలయాళీ దినపత్రిక మాతృభూమిలో ఆయన ఓ వ్యాసం రాశారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే వర్కింగ్ కమిటీలోని 12 స్థానాలకు కూడా ఎన్నికలను ప్రకటించాల్సి ఉందని ఆ ఆర్టికల్ లో శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం సోనియాగాంధీకి లేఖ రాసిన జీ 23 నేతల్లో శశిథరూర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీ పునరుజ్జీవానికి నాంది అని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. పార్టీలో అధిక శాతం మంది రాహుల్ గాంధి పార్టీ నాయకత్వం చేపట్టాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. థెరిసా మే స్థానంలో డజనుకు పైగా మంది పోటీ పడగా బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ద్వారా పార్టీ వైపునకు ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన ఆ ఆర్టికల్ లో రాశారు.
దీంతో చాలా మంది అభ్యర్ధులు పోటీకి ముందుకు వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే దేశంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై ఆసక్తిని చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న స్థితి,సంక్షోభం నేపథ్యంలో ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపర్చడంతో పాటు ఓటర్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ వ్యాసంలో శశిథరూర్ చెప్పారు. పార్టీ పగ్గాలు చేపట్టే నేత ఎవరైనా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను సరిదిద్దాలన్నారు. దీనికి ప్రణాళిక బద్దంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీ దేశానికి సేవ చేయడానికి సాధనంగా ఉండాలన్నారు. పార్టీ నుండి సీనియర్లు బయటకు వెళ్లడం పై కూడా ఆయన స్పందించారు. పార్టీలో సంస్కరణలు కావాలని తాను కోరుకుంటున్నట్టుగా చెప్పారు. సీనియర్లు పార్టీలోనే కొనసాగాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస అధ్యక్ష పదవికి ఈ ఏడాది అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న ఈ ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. ఈఎన్నికల నోటిపికేషన్ ను సెప్టెంబర్ 22న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 30 వరకు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలుకు సమయం ఇచ్చారు.
Also Read :