ఓట్లు అనగానే చాలా మంది పిచ్చోళ్లు మోపతైరు. మందుపోస్తరు. పైసలు పంచుతరు. నేను నా జీవితంలో మందు పోయలేదు. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మందుపోయ.. పైసలు పంచ.. మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూసుంట.. తప్పితే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం నా వల్ల కాదు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ కులవృత్తుల వారికి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు ఎలక్షన్లలో నాలుగుసార్లు గెలిపించారు. గెలిపించినందుకు మంచిగ సేవ చేస్తా, పని చేస్తా. బీద బిక్కి కడుపులో పెట్టుకుని కుల, మతం పిచ్చి లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఒక తమ్ముడిగా, అన్నగా అండగా నిలుబడతా’ అని భరోసా ఇచ్చారు. 70 ఏండ్ల పాటు అధికారమిస్తే ‘మీరేం చేశారో’ చెప్పాలని ప్రతిపక్షాలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కులవృత్తులకు ఇచ్చే లక్ష రూపాయలు, ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ. 3 లక్షలను గ్రాంటు కింద ఇస్తున్నామని, వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలన అయ్యే వరకు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత వరకు సంక్షేమ పథకాలకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు.
నేతన్నలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వారికి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చీరల తయారీలో జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తంగళ్లపల్లిలోని ఓ సాంచాల కార్ఖానాకు తాను స్వయంగా వెళ్లి ఓ కార్మికుడిని వివరాలు అడిగితే.. జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నట్టు హిందీలో చెప్పాడని తెలిపారు. సిరిసిల్ల మెడికల్ కళాశాలను వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించి, పేదలకు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలందిస్తామని తెలిపారు.
మూలవాగు ఒడ్డున రూ.98 లక్షలతో నిర్మించిన బండ్ పార్క్‌ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు జిందం కళ, రామతీర్థపు మాధవి పాల్గొన్నారు.