కాకినాడ మేయర్‌గా 40 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్-1గా 24 వ డివిజన్ లార్ కార్పొరేటర్ మీసాల ఉదయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు కాకినాడ కార్పోరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన మేయర్ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు హాజరుకాలేదు.
గత మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 12న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం ఎన్నికలు నిర్వహించారు.
నేటి సమావేశానికి టిడిపి అసమ్మతి, బిజెపి, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు వైసిపి కండువాలతో హాజరు కావడం గమనార్హం. ఈ ఎన్నిక కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై మెజార్టీ కార్పొరేటర్లు అచంచలమైన విశ్వాసం కనబరిచారని మంత్రి కన్నబాబు అన్నారు. కాకినాడ నగర అభివృద్ధికి అన్ని పార్టీల కార్పొరేటర్లు కలిసి కట్టుగా ఒక జట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే అందరూ కలిసి వచ్చారని, అందుకే ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పదవిని తాను ఒక అలంకారం గానో, హోదాగానో భావించకుండా ఒక బాధ్యతగా తీసుకుని కాకినాడ నగర అభివృద్ధికి పాటుపడతానని మేయర్ శివ ప్రసన్న చెప్పారు.