ఉత్తర భారత దేశంలో చలి పులి పంజా విసురుతుండగా… మరోవైపు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని హిమపాతం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు ధవళ వర్ణం సంతరించుకున్నాయి. మంచులో పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతుండగా స్థానిక ప్రజలు ఆహార సామాగ్రికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతున్నది. మరో వారం రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు భారీ హిమపాతంతోపాటు, వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమైన జోషీమఠ్ అనేక మందికి పవిత్రమైన దైవభూమి. అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట చేపట్టిన విచక్షణ లేని అశాస్త్రీయ నిర్మాణాల వల్ల మొత్తం ఆ ప్రాంత ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నది. గతకొంతకాలంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులతో పట్టణం కుంగిపోతున్నది. క్రమంగా ఇండ్లు నేలమట్టమవుతున్నాయి. కాగా, జోషీమఠ్ ఏటా 10 సెంటీమీటర్లు కుంగిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 2018 నుంచి ఈ కుంగుబాటు ప్రారంభమైందని వెల్లడైంది. అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆఫ్ థెస్సాలోనికి, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాస్‌బర్గ్ శాస్త్రవేత్తలు తాజా ఉపగ్రహ చిత్రాలను పరీక్షించారు. గత నాలుగేండ్లుగా జోషీమఠ్ కింది భూమిలో గురుత్వాకర్షణ అస్థిరత ఏర్పడుతున్నదని గుర్తించారు.
పట్టణంలోని నేలలు నిర్మాణాలకు పనికిరావని వెల్లడించారు. శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఉపయోగించారు. ఇంటర్‌ఫెరోమెట్రిక్ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఇన్‌సార్) టెక్నిక్‌తో భూ ఉపరితలంపై చిత్రాలను తీశారు. జోషీమఠ్‌ను ఏ, బీ, సీ, డీ ప్రాంతాలుగా విభజించి పరిశీలించగా, ఏ (తూర్పు భాగం), బీ (పశ్చిమ భాగం) ప్రాంతాలు కిందికి జారుతూ పోతున్నట్టు తేలింది. తూర్పు భాగంలో ఉపరితల స్థానభ్రంశం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉండగా, జోషీమఠ్ మాత్రమే కాకుండా 23 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు కలిగిన ఝారియా, భుర్కుండా, కాపసారా, రాణిగంజ్, తల్చర్ కూడా ఏటా గరిష్ఠంగా 12 సెంటీమీటర్ల మేర కుంగుతున్నాయి.