విద్యార్థులను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అరణ్య భవన్ లో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి (టీస్ కాస్ట్) కార్యనిర్వహక సమావేశం జరిగింది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎస్ కాస్ట్ తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీఎస్ కాస్ట్ అధికారులు వివరించారు. భౌగోళిక సూచికాల మేధో సంపత్తి పరమైన హక్కు పత్రాల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలకు సాంకేతికతను సామాజికంగా వినియోగించుకోవడం- రాష్ట్ర సంస్థలు వాటిని అడాప్ట్ చేసుకోవడం, విద్యార్థుల్లో సైన్స్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడం, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం, విశ్వ విద్యాలయాలతో సమన్వయం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని, పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనను మెరుగుపర్చేందుకు, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలితో సమన్వయం చేసుకుంటూ టీఎస్ కాస్ట్ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయిల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఆశించిన స్థాయిలో నూతన ఆవిష్కరణలు జరగటం లేదని, శాస్త్రవేత్తలు, విద్యాసంస్థలు వ్యవస్థలోని లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పనితీరును సమీక్షించుకొని, నూతన ధోరణులకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకతో పాటు పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయం రంగం, పర్యావరణ, సహజ వనరుల నిర్వహణలో పరిశోధనలు చేసే విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. శాస్త్రీయ పరిజ్ఞానం ఉపయోగపడాలే సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లలో ఉత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేయాలన్నారు. దీంతో పాటు ప్రాజెక్టుకు కావాల్సిన ఆర్థిక సహాయం, గైడెన్స్ సహకారం అందించేలా టీఎస్ కాస్ట్ మరింత చొరవ చూపాలన్నారు.
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్న హైదరాబాద్… కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని తెలిపారు. ఐటీ, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహకారంతో రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ ఎం. నగేష్, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ సైంటిస్ట్ రష్మి, ఉత్తరప్రదేశ్ శాస్త్ర, సాంకేతిక శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేష్ గంగ్వార్, తదితరులు పాల్గొన్నారు.