Thursday, November 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసుఖ నిద్రకు చిట్కాలు

సుఖ నిద్రకు చిట్కాలు

Some Tips To Follow For Easy Sleep :

అర్ధ రాత్రి ఓ పెద్దాయన నిద్ర పట్టక పచార్లు చేస్తున్నాడు. అప్పుడే రూమ్ లోంచి మనవడు బయటకొచ్చి ఫ్రిడ్జిలో కూల్ డ్రింక్ తీసుకుని తాగుతున్నాడు. తాత మనవడిని నిద్రపోలేదా అని అడిగాడు. అప్పుడేనా ఇంకా ఒంటిగంటకూడా కాలేదుగా అన్నాడా మనవడు. నిద్ర పట్టక బాధపడేవారు కొందరైతే, అసలా మాటే తల్చుకోకుండా గడిపేసే తరం ఇంకొకరు…

నిద్ర ఒక యోగం. వస్తే భోగం.. రాకపోతే రోగం. సింపుల్ గా ఇలా చెప్పెయ్యచ్చు. కానీ నిద్ర పట్టక దొర్లడం అనే బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. దానికి తగ్గట్టు ఆరోగ్య, వ్యాయామ, పోషకాహార నిపుణులందరూ ఎన్ని చేసినా కంటినిండా నిద్ర పోతేనే మంచి ఫలితాలంటున్నారు. ఇందుకు వారు చెప్పే చిట్కాలు పాటించాక కూడా నిద్ర రాదు. అది వేరే సంగతి. మరికొందరు అసలెందుకు నిద్ర రావడంలేదో కనుక్కోమంటారు. అందుకోసం రాత్రంతా జుట్టు పీక్కున్నా కారణం మాత్రం తెలియదు. పడుకోబోయే ముందు పాలు తాగినా, అరికాళ్లకు కొబ్బరినూనె రాసినా అలా చూస్తూ ఉండాల్సిందే గానీ కునుకు లేదనే వారే కనిపిస్తారు.

వయసు పై బడే కొద్దీ నిద్ర తగ్గడం సహజమే కానీ నిద్ర తగ్గి వయసు పెరగడం అసహజం. ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చాక నిశాచరులు ఎక్కువయ్యారు. మరి మన జీవన శైలిని, జీవ గడియారాన్ని సమూలంగా మార్చేసిన ఘనత టీవీ తర్వాత ఇంటర్నెట్ , సెల్ ఫోన్ దే. అర్ధ రాత్రి దాటినా సెల్లులో తొంగిచూస్తూ అదేమంటే నిద్ర రావడం లేదంటారు. కుర్రకారుకి లాప్టాప్ కవచ కుండలం. ఇవన్నీ ఎలా ఉన్నా నిద్ర పోడానికి ప్రపంచంలో ఎన్ని చిట్కాలు ఉన్నాయా అని సోదెమ్మ మొదలు గూగులమ్మ దాకా సలహాలు అడుగుతూనే ఉంటారు. ఈ విషయంలో ఇటీవలి పరిశోధనల్లో ఒక రెండు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

  • కొంచెం మందంగా, బరువుగా ఉండే దుప్పటి కప్పుకుంటే నిద్ర తాలూకు సమస్యలు 20 శాతం తేలిపోతాయట.
  • చాలా మంది మర్నాటి పనుల గురించి ఆలోచిస్తూ నిద్ర పోవడం లేదట. ఇటువంటివారు ఒక పేపర్ మీద చేయాల్సిన పనులన్నీ లిస్ట్ రాసుకుంటే మంచి ఫలితం గ్యారంటీ
  • నిద్రపోడానికి పది నిముషాల ముందు హాయిగా స్నానం చేసి పడుకుంటే వచ్చే నిద్రని ఆహ్వానించండి
  • వీలయితే అప్పుడప్పుడు బెడ్ రూమ్ అలంకరణ మార్చాలి
  • వారంలో ఐదురోజులు నిద్ర పెట్టకపోయినా వీకెండ్స్ కుంభకర్ణుడి వారసులా? అలా అయినా పర్లేదు. జీవితకాలం పెరుగుతుందని పరిశోధకుల భరోసా
  • ఏదో నిద్ర పోయామన్నట్టు కాకుండా మానసిక, సృజనాత్మక, సాంఘిక, ఆధ్యాత్మిక,ఇంద్రియ పరమైన విశ్రాంతి దొరుకుతుందా లేదా అని గమనించమని సలహా. అప్పుడు ఇంకా చక్కగా నిద్ర పడుతుంది

మరింకేం, హాయిగా బరువుగా దుప్పటి కప్పి నిద్రను ఆహ్వానించండి.

– కె. శోభ

Must Read : ఐదేళ్ళ తర్వాత ఇంటర్నెట్ సేవలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్