Saturday, January 18, 2025

పీక తెగుద్ది!

Don’t Criticize:
ప్రపంచ తెలుగు కొడుకుల్లారా! కూతుళ్లారా!
ఇందుమూలముగా ట్విట్టర్ ద్వారా తెలియజేయునది ఏమనగా…
తెలుగు జాతి గౌరవాన్ని, కీర్తి ప్రతిష్ఠలను కాపాడే తరుణోపాయం దొరికింది.

దాదాపు పదిహేను వందల సంవత్సరాల వెనక్కు వెళ్లి తెలుగు భాషా చరిత్రను తెలుసుకోవాల్సిన శ్రమ లేదు. త్రిలింగం, తెనుగు, తెలుగు, తెలంగాణం, ఆంధ్ర భౌగోళిక చారిత్రక శిలాజాలను తవ్వాల్సిన పని లేదు. మహాభారత యుద్ధ కాలానికే పాండవుల పక్షాన నిలబడిన ఆంధ్రుల ప్రస్తావన గురించి రెఫెరెన్సులు, చారిత్రక ఆధారాలకోసం పురాణ గ్రంథాలు, ఇతిహాస కావ్యాలు వెతకాల్సిన పనిలేదు. తమిళగడ్డ మీద అయోధ్య రాముడితో తెలుగులో ముచ్చట్లు పెట్టిన త్యాగయ్య కృతుల్లో చిందిన తెలుగు తేనె చినుకుల రుచి చూడాల్సిన పనిలేదు. వైకుంఠం వదిలి తిరుమలలో ఇల్లు కట్టుకున్న వెంకన్నకు తెలుగు జానపదాలతో క్షణ క్షణోత్సవం చేసిన అన్నమయ్య పదాల్లో హొయలుపోయిన తెలుగు మాండలిక మాధుర్యం చెవి బడలిక తొలగిపోయేలా వినాల్సిన పనిలేదు. ఓ రామ! నీ నామమెంత రుచిరా? అని రాముడికే రామనామం తీపిని వివరించిన భద్రాద్రి రామదాసు కీర్తనల తెలుగు భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిన పని లేదు. బుగ్గల మీద కాటుక కంటినీరు జారేలా ఎందుకు ఏడుస్తావు తల్లీ! అని సాక్షాత్తు సరస్వతిని ఓదార్చి అజరామరమయిన తెలుగు భాగవతాన్ని ఆమె చేతిలో పెట్టిన, పోతపోసిన పద్య కవితల పోతన్న భక్తి సుధారస తెలుగు గంగను నెత్తిన సంప్రోక్షించుకోవాల్సిన పనిలేదు.

Rrr Movie

శ్రీనాథుడి సీసపద్యం ఒక్క పాదం కూడా చదవాల్సిన పనిలేదు. వేమన్న ఆటవెలదులను చూడాల్సిన పని లేదు. సుమతీ, భాస్కర శతకాల జోలికి పోవాల్సిన పనిలేదు. విశ్వనాథ కల్పవృక్షం ఎక్కడుందో వెతకాల్సిన పనిలేదు. సి నా రె విశ్వంభర అక్కర్లేదు. రావూరి భరధ్వాజ పాకుడు రాళ్ల మీద జారిపోవాల్సిన పనిలేదు. తుపాకీ గుండుకు గుండె చూపిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ఆత్మ కథ చదవాల్సిన పనిలేదు. పి వి ఠీవిని పొగడాల్సిన పనిలేదు. గుక్క తిప్పుకోకుండా ఏమంటివి? ఏమంటివి ? అన్న ఎన్ టి ఆర్ డైలాగులు చెప్పాల్సిన పనిలేదు.

తలచుకుంటే ఏవేళ అయినా ఒళ్లు పులకించిపోయే అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం లేదు. వెయ్యేళ్లు దాటిన తెలుగు సంగీతం, కళలు, సంస్కృతుల వైభవోజ్వల పుటలను తిరగేయాల్సిన పనిలేదు. స్వాతంత్ర్య పోరాటంలో తెలుగువారి పాత్రను పొగుడుకోవాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ప్రపంచం నలుమూలల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడి భూగోళమంతా తెలుగు జెండాను రెపరెపలాడిస్తున్నవారిని అభినందించాల్సిన పనిలేదు.

మరి ఇవన్నీ వదిలి ఏమి చేస్తే తెలుగు జాతి పౌరుషాగ్నిని మనం గౌరవించినట్లు అనే కదా మీ ప్రశ్న. ఇవన్నీ వదిలి తెలుగు కళను అంతర్జాతీయ యవనిక మీద ఏమి చేస్తే నిలబెట్టవచ్చు అన్నదే కదా మీ సందేహం?

దానికి “కొడకల్లారా!” అని ప్రేమ పూర్వక సంబోధనతో ఒక తెలుగు పారిశ్రామికవేత్త కమ్ నిర్మాత కమ్ రాజకీయ నాయకుడు ఇచ్చిన పిలుపు కమ్ సమాధానం కమ్ ఆదేశం కమ్ హెచ్చరిక కమ్ తిట్టు కమ్ కర్తవ్య బోధ కమ్ జ్ఞానం కమ్ మందలింపు కమ్ ఇంకా ఎన్నో తెలియని అనేక కమ్ లు యేమియనగా…

“త్రిబుల్ ఆర్ సినిమాను విమర్శించకపోవడం”. సింపుల్!

తెలుగు భాషలో కొడుకు సంబంధ బోధక వాచకం. అందులో “డు”లో ఉ లోపిస్తే “కొడకు” అవుతుంది. ఆ కొడకును సంబోధించాల్సి వస్తే “కొడకా!” అవుతుంది. అది పచ్చి బూతు. తిట్టు. ఒక ప్రాంతంలో అనాదిగా “ఉ” బదులు “అ” వాడుతున్నారు అని మాండలిక ఉచ్చారణ వ్యాకరణాంశాల జోలికి వెళ్లడం ఆరోగ్యాలకు ఆట్టే మంచిది కాదు!

లోకంలో పుట్టే ప్రతివారూ ఎవరికో ఒకరికి కొడుకు లేదా కూతురు అయ్యే ఉంటారు అని సర్దుకుపోవడం తప్ప…ఎవరు ఎవరికి తండ్రి? ఎవరు ఎవరి కొడుకు? అని డి ఎన్ ఏ పరీక్షలకు వెళితే…ఈ దేశమంతా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ అవుతుంది!

అసలే కరోనా మూడు నాలుగు వేవ్ లు తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న వేళ. ఇప్పుడిప్పుడే లోకం కోలుకుంటోంది. ఎందుకొచ్చిన చావు? త్రిబుల్ ఆర్ చూసి, అనవసర విమర్శలు చేసి పీకలు కోయించుకుంటారో? చూసి..పరవశించి…తెలుగు కళను పొగిడి బతికి పోతారో మీరే నిర్ణయించుకోండి!

అన్నట్లు…
ఎవర్రా అక్కడ?
తెలుగు సినిమాకు కులం పట్టింపు ఉందని కూసినవాడు?
కళకు కులమేమిట్రా గొంతుకోసిన మొండేల్లారా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

కాసుల వేటకు కళాత్మక నామకరణం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్