Saturday, June 13, 2026
HomeTrending NewsORR: వెయ్యి కోట్లు చేతులు మారాయి - రేవంత్ రెడ్డి

ORR: వెయ్యి కోట్లు చేతులు మారాయి – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రయివేటుకు తాకట్టు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను ప్రయివేటుకు అమ్మేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఈ రోజు విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఓఆర్ ఆర్ కాంట్రాక్టు అంశంపై దుమ్మెత్తి పోశారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదన్నారు. కనీసం 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఔటర్ 7380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని, దీని వెనక సోమేశ్ కుమార్ వ్యవహారం నడిపాడు. అరవింద్ కుమార్ సంతకం పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం దిగిపోయే ముందు తీసుకున్న నిర్ణయాలను వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్షిస్తుందని స్పష్టం చేశారు.

దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని, ఇందులో 1000 కోట్లు చేతులు మారాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని, మేం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారిస్తామన్నారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందన్నారు. గత 4 సంవత్సరాల నుంచి టోల్ ను ఈగల్ ఇన్ఫ్రా కు కట్టబెట్టారని, ఔటర్ రింగ్ రోడ్ ను ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం ఉపయోగించుకుందని విమర్శించారు. ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునెందుకు కేటీర్ కుటుంబం ఆలోచించిందని, తమ కుటుంబానికి లాభం ఉండదని 30 సంవత్సరాలు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారంటే… విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ ప్రామాణికం అన్నారు.

కెసిఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నారు. దీనిపై బీజేపీ నేతలు కూడా స్పందించాలని, ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ను వినియోగించే పరిస్థితులు లేవన్నారు. టెండర్ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని తెలిపారు. వాస్తవంగా ఇంతకు ముందు దీన్ని ఆదానికి కట్టబెట్టాలని చూశారని, ఆరోపణల నేపథ్యంలో ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని వెల్లడించారు. 2018 నుంచి ఎవరికి టోల్ వసూలు బాధ్యత ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్ ను ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని రేవంత్ రెడ్డి అడిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular