Monday, February 24, 2025
HomeTrending Newsమేం వదిలేసిన ఎన్నికలు: సోమిరెడ్డి

మేం వదిలేసిన ఎన్నికలు: సోమిరెడ్డి

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి కనీసం పాతిక సీట్లు కూడా రావని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల తర్వాత వైసీపీ ప్రజల మద్దతును గణనీయంగా కోల్పోతూ వస్తోందని అయన విశ్లేషించారు. అధికార వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, అరాచకాలు, గూండాయిజానికి నిరసనగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తెలుగుదేశం బహిష్కరించిందని అన్నారు. నేటి ఫలితాలపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వోస్తుందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

నామినేషన్ల సమయంలో పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకొని విపక్షాలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. దాడులు, దౌర్జన్యాలతో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటుహక్కును హరించి వేశారని విమర్శించారు. పుంగనూరు, తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎంపిటిసిలను వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందన్నారు.  ఇవి తాము వదిలేసిన ఎన్నికలని, వీటిలో గెలిచామని గొప్పలు చెప్పుకోవడం వైసీపే నేతలకే సిగ్గుచేటన్నారు.

2013లో పద్దతిగా జరిగిన ఎన్నికల్లో టిడిపి పాల్గొని మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు, తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో తాము విజయం సాధించామన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కనీసం ఒక గంట సేపు అయినా మంత్రులు చేస్తున్న పనులపై దృష్టి దృష్టి పెట్టే ఆలోచన లేదా అని ప్రశ్నించారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్