ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేయగల సతా భారతీయ జనతా పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పాత 13 జిల్లాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కృష్ణానదిపై తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఐకానిక్ బ్రిడ్జి కూడా నిన్ననే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక AIIMS ఆసుపత్రి, VIT, SRM, AMRUTHA యూనివర్సిటీ తదితర విద్యా సంస్థలను బిజెపి నేతలతో కలిసి సోము వీర్రాజు పరిశీలించారు. ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న మౌలిస వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విట్, అమృత, ఎస్ఆర్ఎం లాంటి అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలు అమరావతిలో తమ విద్యాలయాలు ప్రారంభించాయని, ఇది మనకు గర్వకారణమని, కానీ ఇప్పుడు కనీసం రోడ్లు కూడా లేని దుస్థితిలో ఆయా సంస్థల్లో చదువుకుంటున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంనుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విద్యార్ధులు వస్తుంటారని, వారు తమ రాష్ట్రం గురించి, ఇక్కడి వసతుల గురించి ఏమి అనుకుంటారో అనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని వీర్రాజు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీస 11 కిలోమీటర్ల రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, కానీ విశాఖకు ఇప్పటివరకూ ఏమి చేశారో చెప్పాలని సోము నిలదీశారు. ప్రజలను మోసం చేసే విధానంలో సిఎం ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. విశాఖలో 50 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఐదు వేలకోట్లతో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశామమన్నారు.
Also Read : ఏపీకి ఎలా వస్తారు: కేసిఆర్ కు సోము ప్రశ్న