Firraju: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో తీవ్ర అసహనానికి లోనైన ఆయన పోలీసులను నెట్టివేసే ప్రయత్నం కూడా చేశారు. ఆమలాపురం పర్యటనకు వెళుతున్న వీర్రాజును జొన్నాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డగించారు. అమలాపురం వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పారు. వీర్రాజు కాన్వాయ్ కు అడ్డంగా ఇతర వాహనాలను పెట్టారు. దీంతో పోలీసులపై సోము తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసుకు స్వేచ్చగా, స్వతంత్రంగా నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని, అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారని, పోలీసుల భద్రత మధ్య రాస్త్రాన్ని ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన దిగజారిందనడానికి ఇలాంటి చర్యలే నిదర్శనమన్నారు. తాను ఎస్పీతో మాట్లాడతానని ఫోన్ కలిపి ఇవ్వాలని అక్కడ ఉన్న ఎస్ ఐ తో వాగ్వాదానికి దిగారు.
అమలాపురం వెళ్లి అక్కడి ప్రజలకు భయభ్రాంతులకు గురి కావొద్దని ధైర్యం చెప్పడానికే అమలాపురం పర్యటన పెట్టుకున్నానని వీర్రాజు చెప్పారు. ఉదయం నుంచి తనను ఓ దొంగ వాడిలా ఫోటోలు తీయడం, తన వాహనాలకు ప్రైవేట్ వెహికల్స్ అడ్డు పెట్టి, టార్చర్ చేశారని ఆరోపించారు. రాజమండ్రి నుంచి ఇది మొదలయ్యిందన్నారు. మంత్రి ఇళ్లు, ఓ ఎమ్మెల్యే ఇల్లు తగలబెడుతుంటే ఏం చేస్తున్నారని, వీరి సత్తా ఏమైపోయిందని నిలదీశారు. పోలీసుల్లో చేవ, సత్తా పోయిందన్నారు.