బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాలయాల యాత్ర నేడు మొదలైంది. నేటినుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాలను అయన సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని యాత్ర చేపడుతున్నట్లు వీర్రాజు గత వారం ప్రకటించారు. మొదటగా శైవక్షేత్రంలోని శివుడికి అభిషేకం నిర్వహించి అనంతరం, గురుపౌర్ణమి సందర్భంగా, క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామిని సన్మానించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలకే పరిమితమైందని, దీన్ని మార్చుకోవాలని వీర్రాజు సూచించారు. సిఎం జగన్ కు చెప్పేవారు లేరని, చెబితే వినే పరిస్థితుల్లో కూడా అయన లేరని…. కాబట్టి అమ్మవారికి చెప్పి, ముఖ్యమత్రికి ఆ తల్లి ద్వారా చెప్పాలను కుంటున్నామని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, ఆర్ధికంగా రాష్ట్ర స్థితిని మెరుగుపరుచుకునేలా పాలకులకు ఆలోచన కలగాలని వేడుకున్నట్లు వివరించారు.
ముఖ్యమంత్రికి టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు, చర్చిల నిర్మాణం, పాస్టర్లకు జీతాలు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు సక్రమంగా చెల్లించే విషయంలో లేకపోవడం శోచనీయమని వీర్రాజు అన్నారు. వీర్రాజు వెంట బిజెపి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.