ICC Women World Cup: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా 6 పరుగులతో విజయం సాధించింది. పాకిస్తాన్ కు చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సిన దశలో రెండు వికెట్లు కోల్పోయి ఆలౌట్ కావడంతో ఓటమి పాలైంది.
మౌంట్ మాంగనూయి లోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా 9 పరుగులకే రెండు వికెట్లు ( ఓపెనర్ లీ-2; టజ్మిన్ బ్రిట్స్-2) వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ వోల్వార్ట్- కెప్టెన్ సూనే లూస్ లు మూడో వికెట్ కు 89 పరుగులు జోడించారు. వోల్వార్ట్ 75; లూస్ 62 స్కోరు చేసి ఔటయ్యారు. చివర్లో ట్రయాన్, చెట్టి చెరో 31 పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, ఫాతిమా చెరో మూడు; డయానా బేగ్, నష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాతా బ్యాటింగ్ మొదలు పెట్టిన పాకిస్తాన్ 26 పరుగుల వద్ద ఒకేసారి రెండు వికెట్లు కోల్పోయింది. సిద్రా అమీన్-12, కెప్టెన్ మరూఫ్ డకౌట్ గా వెనుదిరిగారు. మరో ఓపెనర్ నహిదా ఖాన్-40; ఒమైమా సోహైల్-65; నిదా దార్- 55 పరుగులతో రాణించారు. మంచి ఫామ్ లో ఉన్న నిదా దార్ 49వ ఓవర్లో రనౌట్ కావడం పాక్ విజయావకాశాలకు గండి కొట్టింది. పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు; మరిజేన్నే కప్, ఆయబొంగా ఖాక చెరో రెండు; మసబత క్లాస్ ఒక వికెట్ పడగొట్టారు.
మూడు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ను దెబ్బతీసిన షబ్నిమ్ ఇస్మాయిల్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
ఇవి కూడా చదవండి: మహిళల వరల్డ్ కప్: ఇండియాపై న్యూజిలాండ్ విజయం