Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యారంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి - మంత్రి తలసాని

విద్యారంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి – మంత్రి తలసాని

ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయి అభివృద్ధి చేసి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తి – మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలో మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను మంత్రి తలసాని స్థానిక MLA దానం నాగేందర్ DEO రోహిణి ప్రధానోపాధ్యాయురాలు కరుణా శ్రీ లతో కలిసి ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట డివిజన్ ధరంకరం రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో MLC వాణీదేవి, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారిలతో కలిసి మంత్రి తలసాని పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అందులో భాగంగా మన బస్తీ -మన బడి క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలల అభివృద్ధికి 7259 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని, మొదటి విడతలో 9123 పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టడం కోసం ప్రభుత్వం 3497 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. మూడు విడతలలో అన్ని పాఠశాలలను ఈ కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.


ఈ కార్యక్రమం క్రింద ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయుట, పాఠశాల భవనాలకు కలర్స్ వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ నిర్మించడం వంటి మౌలిక సౌకర్యాలు, వసతులను కల్పించడం వంటి పనులు చేపడతారని వివరించారు. మన బడి మన బస్తి కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Also Read ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్