Tuesday, September 24, 2024
HomeTrending Newsఉచిత విద్యుత్ పేరుతో కెసిఆర్ దోపిడీ

ఉచిత విద్యుత్ పేరుతో కెసిఆర్ దోపిడీ

24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ లోనే ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుని 40 గ్రామాలకు సరిపడా కరెంట్ ను ఉచితంగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను తనఖా పెట్టి అప్పు తీసుకున్న కేసీఆర్ రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేశారన్నారు. అదానీ కంపెనీకి కట్టబెట్టేందుకే బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారంటూ… రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలేనన్నారు. కాలుష్యం పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం మూసివేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఎరువుల ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఎరువుల ఫ్యాక్టరీని మూసివేయించి రైతులకు నష్టం చేసే చర్యకు పూనుకున్నారని ఆరోపించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతోమంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పారు. వాళ్లందరికీ ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించడం సిగ్గు చేటన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే… వాళ్లు దాచుకున్న డిపాజిట్లను కూడా డ్రా చేసి ఆ డబ్బుతోనే కార్మికులకు జీతాలు చెల్లించే స్థాయికి కేసీఆర్ దిగజారారని మండిపడ్డారు.

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్. ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుబాష్, జె.సంగప్ప, పోరెడ్డి కిషోర్ తోపాటు సీనియర్ నేతలు సుధాకర్ శర్మ, దేశ్ పాండే, సునీతారెడ్డి లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

బొగ్గు దిగుమతి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి తనను తాను కాపాడుకోవాలనే ఆలోచన కేసీఆర్. కరెంట్ ఛార్జీల పెంపుతో కేసీఆర్ ప్రభుత్వంపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసి వాళ్ల ద్రుష్టిని మళ్లించేందుకు కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు కేసీఆర్ తెరదీసిండు. కేసీఆర్, ఆయన కుటుంబం సేఫ్… మంత్రులతో మాట్లాడిస్తున్నడు, జనం తిరగబడుతుండటంతో మంత్రులకు భయం పట్టుకుంది. ఇప్పుడు అధికారులతో అబద్దాలను వాస్తవాలుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నడు.

కరోనా అనంతరం 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ ఉంది. ఈ సమస్య నుండి బయట పడటానికి కేంద్ర ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. దీనిద్వారా కేవలం యూనిట్ కు 5 నుండి 10 పైసలు మాత్రమే అదనపు భారం పడుతుంది. దిగుమతి అనేది కొత్తదేమీ కాదు. అనేక ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియ. దీన్ని కేసీఆర్ భూతద్దంలో పెట్టి చూపే కుట్ర చేస్తున్నడు… కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నడు. 60 వేల కోట్లకుపైగా బకాయిలు డిస్కంలకు చెల్లించకుండా నష్టం చేస్తున్నడు. ఆ నష్టాలు భరించలేక రూ. 6 వేల కోట్ల కరెంట్ ఛార్జీలు పెంచినని చెబుతున్న కేసీఆర్… ప్రభుత్వ కార్యాలయాల నుండి రూ.17 వేల కోట్ల కరెంటు బకాయిలుంటే ఎందుకు చెల్లించడం లేదు? పాతబస్తీ నుండి ఏటా వెయ్యి కోట్ల కరెంట్ బకాయిలను ఎందుకు వసూలు చేయడం లేదు? మరో ముఖ్య విషయం ఏమిటంటే… కేసీఆర్ ఫాంహౌజ్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ కట్టుకున్నడు. 40 గ్రామాలకు ఎంత కరెంట్ ఖర్చవుతుందో… అంత కరెంట్ ను ఉచితంగా వాడుకుంటున్నడు. విద్యుత్ బిల్లులు చెల్లించని ప్రాంతాలు గజ్వేల్, సిద్దిపేట, పాతబస్తీ ఉన్నయని ప్రభుత్వ అధికారులే చెబుతున్నరంటే.. పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవాలి.

సీఎంను చూసి మంత్రులు కూడా ఫాంహౌజ్ కట్టుకున్నరు. ఇష్టానుసారంగా కరెంట్ ను ఉచితంగా వాడుకుంటున్నరు. బడాబాబులు సైతం దోచుకుంటున్నరు. ఈ దోపిడీ తనాన్ని ఆపాలని సబ్ స్టేషన్లు, ట్రాన్సాఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతుంటే…. అవన్నీ ఎక్కడ బయటపడతాయోననే భయంతో రైతుల పొలాలకు కేంద్రం మీటర్లు పెట్టబోతుందంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నరు. ఆదాని కోల్ మైన్ నుండి బొగ్గు కొనాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటూ ట్రాన్స్ కో సీఎండీ చెప్పడం పచ్చి అబద్దం.. ఆ ఆధారాలకు సంబంధించి లెటర్ ఉంటే చూపాలి. ఓపెన్ మార్కెట్ లో 3 నుండి 3 రూపాయల 50 పైసలకే యూనిట్ కరెంట్ దోరుకుతోంది. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా 6 రూపాయలు వెచ్చించి కొంటూ వందల కోట్ల రూపాయలు దండుకుంటున్నడు. ఈ వాస్తవాలను అర్ధం చేసుకున్నందునే ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో బొగ్గు అవసరమో అంత మేరకు బొగ్గును అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్ పాలన అంతా కుంభకోణాల మయం… భద్రాద్రి పవర్ ప్లాంట్ పెద్ద కుంభ కోణం. ఇండియా బుల్స్ అనే కంపెనీ వర్కవుట్ కాదని ఆ ప్లాంట్ కు సంబంధించి తుప్పపట్టిన మెషీన్ ను వదిలేసుకుంది. ఆ తుప్పుపట్టిన యంత్రాన్ని తీసుకొచ్చి వేల కోట్లు వెచ్చించి భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టి బినామీ వ్యక్తులకు పని అప్పగించిండు… దానిద్వారా వందల కోట్ల రూపాయలు కమీషన్లు దండుకుంటున్న మూర్ఖుడు సీఎం కేసీఆర్… ఆ ప్లాంట్ వయబుల్ కాదని నిపుణులు హెచ్చరించినా వినకుండా ఓపెన్ మార్కెట్ కంటే ఎక్కువ అంటే 6 రూపాయలకు యూనిట్ చొప్పున కరెంట్ కొంటున్నారంటే కేసీఆర్ ప్రజాధనాన్ని ఎంత మేరకు దోచుకుంటున్నడో జనం అర్ధం చేసుకోవాలి.

ఇఫ్పుడు మళ్లా యాదాద్రి పవర్ ప్లాంట్ అంటున్నడు… దాని సంగతేమిటో, దానివెనుక కుట్ర ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. ప్రైవేటు కంపెనీలతో కుమక్కై కమీషన్ల కోసం ఎక్కువ ధరకు కరెంట్ కొంటూ ప్రజాధనాన్ని దుర్వినయోగం చేస్తున్న కేసీఆర్ నైజాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలి. మూలకు పడ్డ మెషిన్ ను ఎందుకు తీసుకొచ్చి పవర్ ప్లాంట్ పెట్టించి వేల కోట్లు ఖర్చు పెట్టినవో ప్రజలకు సమాధానం చెప్పాలి.

కేంద్రాన్ని బూచీగా చూపి కరెంట్ ఛార్జీలను మళ్లీ పెంచే కుట్రకు కేసీఆర్ తెరదీయబోతున్నడు. సీఎం ఆలోచనా, విధానాలన్నీ కుట్రలు, కుత్రంతాలతో కూడినవే.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రను కేంద్రం చేస్తున్నదని ఆరోపించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు టెండర్లు కూడా వేయనేలేదు.. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న కార్మికులు… తాము దాచుకున్న డిపాజిట్లను కూడా డ్రా చేసుకుంటూ ఆ సొమ్మునే కార్మికులకు జీతాలు చెల్లిస్తున్న ఘనడు కేసీఆర్. దీనినిబట్టి కేసీఆర్ ఏ స్థాయికి దిగజారాడో అర్ధం చేసుకోవాలి.

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు వెంచర్లు వేసి బంపర్ ఆఫర్లు పెట్టి వ్యాపారం చేస్తున్నరు. పేదల ఉసురు పోసుకుంటున్నరు. పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై బీజేపీ గత వారం రోజులుగా ప్రజాస్వామ్యబద్దంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నరు. ప్రజాదర్బార్ కు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలను అరెస్ట్ చేసి విడుదల చేయకుండా…. టీఆర్ఎస్ నేతలకు మాత్రం రాచమర్యాదలు చేసుకోవడం సిగ్గు చేటు..

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసివేత పెద్ర కుట్ర దాగి ఉంది. కాలుష్యంతో జనం బాధపడుతున్నందునే మూసివేశామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా…. హైదరాబాద్ నగరం చుట్టూ అనేక ఫార్మా కంపెనీలున్నయ్. కాలుష్యం పెరిగిపోయిందని ప్రజలు పెద్ద ఎత్తున కొట్లాడుతున్నరు. మరి వాటిని మూసేస్తరా? దీనికి సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ నేతలు ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగాలిప్పిస్తానని పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నరు. కోట్లు వసూలు చేసుకున్నరు. వారికి ఉద్యోగాలిప్పించే పరిస్థితి లేదు. డబ్బులిచ్చినోళ్లు తిరగబడుతుండటంతో టీఆర్ఎస్ నేతలు ఫ్యాక్టరీపై ఫిర్యాదు చేసి మూసివేయించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై సూచనలొచ్చాయి. 2, 3 రోజుల్లో జాతీయ నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. నేను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానని చెబుతున్న కుహానా లౌకిక వాదులు 15 నిమిషాల టైమిస్తే హిందువులందరినీ చంపేస్తానన్నప్పుడు, లక్ష్మీ, దుర్గామాత, శ్రీక్రిష్ణుడు, శ్రీరాముడు వంటి హిందూ దేవుళ్లను కించపరుస్తున్నప్పుడు ఎటు పోయారు? బైంసాలో హిందువుల ఇండ్లను తగలపెట్టినప్పుడు.. జర్నలిస్టు అని కూడా చూడకుండా పేగులు బయటకు వెళ్లేదాకా పొడిచినప్పుడు… దళిత బిడ్డ నాగరాజును నరికి చంపినప్పుడు.. గోవులను విచ్చలవిడిగా వధిస్తున్నప్పుడు నోరెందుకు విప్పడం లేదు?

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంవల్ల ఎంఐఎం వాళ్లు గెలిచారు. దానివల్ల హిందువులు నష్టపోయారు… మరి కుహానా శక్తులు ఎటుపోయిండ్రు? హిందువుల పండుగలపై వ్యంగ్యంగా మాట్లాడుతుంటే వాళ్ల గొంతెందుకు పెగలడం లేదు? హిందూ ధర్మంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడితే మతతత్వమా? అంటే నోరు మూసుకుని కూర్చోవాలా? నాపై విమర్శలు చేస్తున్న వాళ్ల విజ్ఝతకే వదిలేస్తున్నా…

Also Read : ఢిల్లీలో స్పందన లేకే కేసీఆర్ వచ్చారా ! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్