తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రెండేళ్ళ తరువాత అయన ఢిల్లీ టూర్ కు వెళుతున్నారు. బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణించిన సమయంలో వెళ్లి నివాళులు అర్పించి వచ్చారు. ఆ తర్వాత అయన హస్తినకు వెళ్ళలేదు.
రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో బాబు సమావేశం కానున్నారు. బాబుతో పాటు మరో నలుగురికి రాష్ట్రపతి భవన్ అపాయింట్మెంట్ ఖరారు చేసింది. ఇటీవల మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి సంఘటనను చంద్రబాబు రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని, వెంటనే 356 అధికరణం ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఇదే విషయాన్ని రాష్ట్రపతి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. పార్టీ ఆఫీస్ పై దాడి అనతరం 36 గంటలపాటు ‘ప్రభుత్వ ఉగ్రవాద దీక్ష’ పేరిట నిరసన తెలిపిన బాబు, ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు నేటి సాయంత్రమే ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రపతి తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో కూడా సమావేశం కావాలని చంద్రబాబు బృందం భావిస్తోంది. వారిని కూడా సమయం కోరారు, అయితే ఇంకా వారి అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు.
రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతుందనే కారణంతో 2018లో ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బైటికి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తిరుగులేని మెజార్టీ తో అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం ఘోర పరాజయం పాలుకావడంతో బాబుతో పాటు ఆ పార్టీ తీవ్ర నైరాశ్యం చెందింది. జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యానించవద్దంటూ తన పార్టీ నేతలకు బాబు సూచనలు కూడా పంపారు. టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి నేతృత్వంలో బిజెపిలో చేరారు.
ఓటమి భారం, కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు ఇటీవలే రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆందోళనలు మొదలు పెట్టాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు శ్రుతిమించడంతో వైసీపీ-టిడిపిల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే టిడిపి ఆఫీసుపై దాడి వ్యవహారం రాష్ట్రంలో రాజకీయాలను మరింత వేడెక్కించింది.
బాబు ఢిల్లీ పర్యటనతో రాజకీయంగా మార్పులు వస్తాయని, సరికొత్త పొత్తులు, ఎత్తులు కూడా ఉంటాయని టిడిపి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.