శ్రీ భద్రాద్రి సీత రాముల తలంబ్రాల బుకింగ్ 1,00,000 వరకు అయ్యిందని.. ఈ నెల 10 తేదీ వరకూ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. ఒకప్పుడు ప్రజా రవాణాకే పరిమితమైన టిఎస్ ఆర్టిసి ఈరోజు కార్గో ద్వారా శ్రీ భద్రాచలం సీతారాముల వారి కల్యాణ తలంబ్రాలను రామయ్య భక్తుల చెంతకు చేర్చాలని నిర్ణయించింది. స్వామివారి వద్దకు వెళ్ళలేని భక్తులకు తలంబ్రాలు అందించేందుకు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని చేపట్టడం జరిగింది.
ఇందులో భాగంగానే టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ బుకింగ్ చేసుకున్న భద్రాద్రి రామయ్య తలంబ్రాలను టిఎస్ఆర్టిసి సంస్థ సిపిఎం కృష్ణకాంత్ నివాసంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి వినోద గోవర్ధన్ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకున్న భక్తుల నుండి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. టిఎస్ఆర్టిసి డిపోల వద్ద మరియు టిఎస్ ఆర్టిసి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈ తలంబ్రాలను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించామని చెప్పారు. భద్రాద్రి రామయ్య భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, స్వామి వారి కృపకు పాత్రులు అయ్యి, టిఎస్ఆర్టిసి సంస్థను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు..