Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Asia Cup: లంక చేతిలో ఇండియా ఓటమి

Asia Cup: లంక చేతిలో ఇండియా ఓటమి

ఆసియా కప్ లో ఇండియా కథ ముగిసింది. సూపర్ 4లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. చివరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్  లో విజయం లంకనే వరించింది. భువీ 19 వ ఓవర్లో రెండు వైడ్స్ తో సహా మొత్తం 14  పరుగులు  సమర్పించుకున్నాడు. ఇది ఇండియా విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పవచ్చు. చివరి ఓవర్లో ఆర్ష దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఐదో బంతిని కీపర్ పంత్ రనౌట్ మిస్ చేయడంతో లంక గెలిచింది.

మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన  ఇండియా నేడు వరుసగా రెండో ఓటమి చవిచూసి టోర్నీకి దూరమైంది. ఇండియా విసిరిన 174 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది. ఓపెనర్లు పాథుమ్ నిశాంక- కుశాల్ మెండీస్ తొలి వికెట్ కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన నిశాంక… చాహల్ బౌలింగ్ లో రోహిత్ పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. అదే ఓవర్లో  చరిత్ అసలంకను చాహల్ డకౌట్ చేశాడు. గుణతిలక కేవలం ఒక్క పరుగు మాత్రమె చేసి అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కుశాల్ మెండీస్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

ఈ దశలో కెప్టెన్ శనక-33; భానుక రాజపక్ష-25 పరుగులతో ఐదో వికెట్ కు 64 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసి గెలిపించారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా 11 పరుగులకే తొలి వికెట్ (కెఎల్ రాహుల్-6) కోల్పోయింది, ఆ వెంటనే విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది మూడో వికెట్ కు 97 పరుగులు జోడించారు. 41  బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసిన రోహిత్ బౌండరీ లైన్ వద్ద పాథుమ్ నిశాంక పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్-34; హార్దిక్ పాండ్యా-17; రిషభ్ పంత్-17 పరుగులు చేయగా చివర్లో రవిచంద్రన్ అశ్విన్ 7 బంతుల్లో ఒక సిక్సర్ తో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు; కరుణ రత్నే, కెప్టెన్ శనక చెరో రెండు; తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

రెండు వికెట్లతో పాటు 33 పరుగులు చేసిన లంక కెప్టెన్ దాసున్ శనక కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : Asia Cup: ఇండియాపై పాకిస్తాన్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్