పురుషుల టి20 వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ లో శ్రీలంకకు షాక్ తగిలింది. ఆసియా కప్ ను గెల్చుకుని మంచి ఉత్సాహంతో ఉన్న ఆ జట్టును నమీబియా 55 పరుగులతో ఓడించి సంచలనం నమోదు చేసింది. నమీబియా విధించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక 19 ఓవర్లలో 108 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది.
గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నమీబియా ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే ఔటైనా జాన్ ఫ్రైలింక్-44; బార్డ్-26; లోఫీ ఈటన్, కెప్టెన్ ఎరాస్మస్ చెరో 20 పరుగులతో రాణించారు. చివర్లో స్మిత్ 16 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ప్రమోద్ మదుసూదన్ రెండు; తీక్షణ, చమీర, కరునరత్నే, హసరంగా తలా ఒక వికెట్ పడగొట్టారు.
లంక జట్టులో కెప్టెన్ శనక-29; భానుక రాజపక్ష-20; ధనుంజయ డిసిల్వా-12, మహేష్ తీక్షణ-11 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నమీబియా బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్ మెన్ పరుగులు చేయలేకపోయారు.
నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, బెర్నార్డ్, బెన్ శికొంగో, జాన్ ఫ్రై లింక్ తలా రెండు; జేజే స్మిత్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆల్రౌండ్ ప్రతిభ చూపిన జాన్ ఫ్రైలింక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.