ఆసియా కప్ -2022ను శ్రీలంక కైవసం చేసుకుంది. నేడు జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పై 23 పరుగులతో విజయం సాధించింది. లంక మిడిలార్డర్ ఆటగాడు భానుక రాజపక్ష మరపురాని ఇన్నింగ్స్ తో…45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హసరంగ-36 (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) కూడా అద్భుతంగా రాణించాడు. ధనుంజయ డిసిల్వా-28 పరుగులు చేశాడు. శ్రీలంక 171 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందుంచగా 20 ఓవర్లలో 147 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయ్యింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లంక 58 పరుగులకే ఐదు వికెట్లు (కుశాల్ మెండీస్ డకౌట్; పాతుమ్ నిశాంక-8; గుణ తిలక-1; ధనుంజయ డిసిల్వా-28; కెప్టెన్ శనక-2) కోల్పోయింది. ఈ దశలో రాజపక్ష-హసరంగ ఆరో వికెట్ కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. హసరంగ (36) ఔట్ కాగా తర్వాత వచ్చిన కరుణరత్నే రాజపక్షకు అండగా నిలిచి ఇద్దరూ కలిసి మరో 52 పరుగులు జోడించారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 6 విఇకేట్లకు 170 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లలో హారిస్ రాఫ్ మూడు; నసీమ్ షా, షాదాబ్ ఖాన్; ఇఫ్తికార్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పాకిస్తాన్ 22 పరుగుల వద్ద ఒకేసారి రెండు వికెట్లు (బాబర్ ఆజామ-5; ఫఖర్ జమాన్ డకౌట్) కోల్పోయింది. రిజ్వాన్- ఇఫ్తికార్ అహ్మద్ లు మూడో వికెట్ కు 71 పరుగులు జత చేశారు. ఇఫ్తికార్ 31 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్ మినహా ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. రిజ్వాన్ 49 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్ తో 55పరుగులు చేసి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. 17వ ఓవర్లో హసరంగ ముగ్గురు పాక్ బ్యాట్స్ మెన్ (రిజ్వాన్, ఆసిఫ్ అలీ, ఖుశ్దిల్ షా) ను పెవిలియన్ పంపాడు. 147 పరుగులకే పాక్ ఆలౌట్ అయ్యింది.
లంక బౌలర్లలో ప్రమోద్ మధుషాన్ నాలుగు; హసరంగ మూడు; కరుణరత్నే రెండు; తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.
రాజపక్ష కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’…. హసరంగ కు ‘మ్యాన్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.