భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరించారు వేద పండితులు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో కల్యాణ వేడుక జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రులు పువ్వాడ అజయ్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పురవీధులు మార్మోగాయి. అభిజిత్ మూహుర్తాన అర్చకులు.. సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. సీతారాములను వధూవరులుగా చూసి భక్తులు తరించారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు భక్తుల కోలాహలం, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు. స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వేద పండితులు వివరించారు.
ప్రపంచమంతటా మానవాళికి సుఖసంతోషాలను కళ్యాణ మహోత్సవం ద్వారా దక్కుతాయని వేద పండితులు చెప్పారు. శుభపరంపరను కొనసాగించే ఆచారాలను రామదాసు ప్రారంభించారని గుర్తు చేశారు. మంచి మనిషిగా జీవిస్తే, దేవతలు కూడా ఆరాధించే అంతటి ధన్యత్వం లభిస్తుందని, రాముడు ఆచరణలో చూపించారని జీయర్ స్వామి సందేశంలో వివరించారు. భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగి మూడు పుష్కరాలు పూర్తయ్యాయని 1987లో ప్రభవ నామ సంవత్సరంలో శ్రీరాముల పట్టాభిషేకం నిర్వహించినట్లు గుర్తు చేశారు.