భద్రాచల క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ ముహూర్తాన సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. రాములవారికి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
టీటీడీ తరఫున వైవీ సుబ్బారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రెండేండ్ల తర్వాత స్వామివారి కల్యాణానికి భక్తులను అనుమతించడంతో.. మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమోగింది. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు శ్రీరామనవమి ఉత్సవాలను ఆంతరంగికంగానే నిర్వహించారు.