Mini Review: ఇప్పుడు తెలుగు తెరపై కుర్ర హీరోల రేస్ కొనసాగుతోంది. ఎవరికి వారు సింపుల్ బడ్జెట్ లో సినిమాలు చేసేసి, కొత్తగా తాము అనుకున్న కంటెంట్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ రేసులో శ్రీసింహా కూడా కనిపిస్తున్నాడు. శ్రీసింహా ఫ్యామిలీ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, తొందరపడకుండా డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రావడానికే ట్రై చేస్తూ ఉండాలి.
గతంలో శ్రీసింహా చాలా సింపుల్ కంటెంట్ లోనే కొత్త పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఓ మూడు సినిమాల వరకూ చేశాడు. అదే పద్ధతిని ఫాలో అవుతూ ఈ సారి ‘భాగ్ సాలే’ చేశాడు. అనుకున్నది దక్కించుకోవడానికి .. చేజిక్కుంచుకోవడానికి తెరపై పరుగు సాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో వైపు నుంచి పోటీకి దిగిన విలన్ గ్యాంగ్ ను హీరో ఎలా ఢీ కొట్టాడనేది కథ. ఈ మధ్యలోనే కామెడీని .. రొమాన్స్ ను .. యాక్షన్ ను రాబడుతూ వెళ్లవలసి ఉంటుంది.
గతంలో ఈ తరహా కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చినప్పుడు, మనం కొత్తగా ఏం చూపించాలను కుంటున్నామనేదే ముఖ్యం. అది చూడటానికే ఆడియన్స్ ఆసక్తిని చూపిస్తారు. కన్ఫ్యూజన్ లో నుంచి కామెడీని లాగడం అన్ని సమయాల్లోను వర్కౌట్ కాదు. హీరో తన చుట్టూ ఉన్న పాత్రలను కన్ఫ్యూజ్ చేయాలి .. అంతేగానీ తాను కన్ఫ్యూజ్ కాకూడదు. అలా చేస్తే ఆయనను ఫాలో అయ్యే ఆడియాన్స్ ఒక్కోసారి అయోమయంలో పడే ఛాన్స్ ఉంది. ‘భాగ్ సాలే’ విషయంలో అదే జరిగిందనేది ఆడియన్స్ టాక్. యాక్టింగ్ పరంగా చూసుకుంటే, శ్రీసింహా రేసులో నిలబడే హీరోనే. కాకపోతే మంచి కథలను ఎంచుకోవాలంతే.