Sri Sri Impact on Telugu Literature :
తెలుగు సాహిత్యంలోకి వెలుగు కిరణంలా ప్రవేశించినవాడు, తెలుగువారి నరాల్లో ప్రవహించినవాడు శ్రీశ్రీ. ఆయన కవిత్వమొక అగ్నిధార. అది అజ్ఞానమనే అడవులను దహించి వేస్తుంది. చీకటి దుప్పట్లు కప్పుకుని ముసుగు తన్నినవారిని ఛళ్లున చరిచి చైతన్య మార్గానికి మళ్లిస్తుంది. ఆయన కలం నుంచి అక్షర నక్షత్రాలు దూసుకొస్తాయి. అవి సమసమాజ స్థాపన కోసం ఆరాటపడుతున్నవారి చేతిలోని కాగడాలై కాంతి మార్గాన్ని చూపిస్తాయి. అలా తన కలాన్ని కాగడా చేసి మరో ప్రపంచానికి దారి చూపిస్తానంటూ ముందుకు నడిచినవాడు శ్రీశ్రీ.
శ్రీశ్రీకి ముందు కవిత్వం రాసినవారు ఉన్నారు. శ్రీశ్రీ తరువాత కవిత్వం రాసినవారు ఉన్నారు. శ్రీశ్రీతో పాటు అక్షరయాత్ర చేసినవారు ఉన్నారు. అయితే శ్రీశ్రీ ఆలోచనా విధానం వేరు. అప్పటివరకూ సాగుతూ వచ్చిన సాహిత్యంలోని కొన్ని పోకడలపై ఆయన నిరసన గళాన్ని వినిపించారు. కడుపు కాలేవారికి కావలసిన కవిత్వం వేరే ఉంది అంటూ భావకవిత్వం గోడలను కూలదోసి, అభ్యుదయ కవిత్వం వైపు ఆయన అడుగులు వేశారు. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్రవేశారు. ఆశయం నెరవేరాలంటే ఆవేశానికి మించిన ఆయుధం లేదని చెప్పారు.
శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 18 ఏళ్ల వయసులోనే ఆయన ‘ప్రభవ’ అనే కావ్య సంపుటిని రచించారు. ఆ తరువాత ఆయన రచించిన ‘మహాప్రస్థానం’ ఆధునిక కవిత్వానికి ఆశ్రయం కల్పించిన మహా సంస్థానమై నిలిచింది. ఒక వైపున సాహిత్యపరమైన ప్రయోగాలు చేస్తూనే, మరోవైపున సినిమాలకు మాటలు, పాటలు కూడా రాశారు. భావకవిత్వం వైపు నుంచి అభ్యుదయ కవిత్వం దిశగా అడుగులు వేసిన శ్రీశ్రీ, పాటల విషయానికి వచ్చేసరికి ఈ రెండింటినీ అద్భుతంగా ఆవిష్కరించారు. ‘ఉప్పెన’లా విరుచుకుపడే కవితలను కురిపించిన శ్రీశ్రీ, ఊహాలోకాల్లో తేలియాడించే పాటలు రాయడం విశేషం.
‘మనసున మనసై’ (డాక్టర్ చక్రవర్తి) .. ‘హలో హలో ఓ అమ్మాయి( ఇద్దరు మిత్రులు) .. ‘ నా హృదయంలో నిదురించే చెలీ’ (ఆరాధన) .. ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ ( మాంగల్యబలం) వంటి పాటలు ఆయన రాసిన వాటిలో మచ్చుకు కొన్ని. ‘వెలుగు నీడలు’ సినిమాలో ”కల కానిదీ .. విలువైనది .. బ్రతుకు కన్నీటి ధారాలలో బలి చేయకు” .. ”అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే .., శోకాల మరుగున దాగిన సుఖమున్నదిలే” అనే పంక్తులు, శ్రీశ్రీ ఒక విషయాన్ని ఎంత స్పష్టంగా .. ఎంత అర్థవంతంగా .. ఎంత లోతుగా .. ఎంత బలంగా చెబుతారు అనడానికి నిదర్శనంగా నిలుస్తాయి.
జెండా పండుగ రోజున శ్రీశ్రీ పాటలు రెండు మాత్రం అన్ని ప్రాంతాల్లో మారుమ్రోగుతాయి. ఒకటి ‘తెలువీర లేవరా’ (అల్లూరి సీతారామరాజు) అయితే .. మరొకటి ‘పాడవోయి భారతీయుడా'(వెలుగు నీడలు). తెలుగువీర లేవరా పాట ఒక్కటి చాలు .. శ్రీశ్రీ భావావేశం .. ఆయన ప్రయోగించే పదాల పదును ఏ స్థాయిలో ఉంటుందనేది అర్థమవుతుంది. ఎవరూ కూడా ఈ పాటలో ఇక్కడ ఈ పదం పడితే బాగుండేది అని చెప్పలేరు. ఒకచోట వాడిన పదాన్ని తీసి మరోచోట సర్దలేరు. అంత కచ్చితమైన పదాలు అమరిపోవడమే ఈ పాట ప్రత్యేకత.
Sri Sri Impact on Telugu Literature :
శ్రీశ్రీ స్ట్రెయిట్ సినిమాలకంటే కూడా అనువాద సినిమాలకి ఎక్కువగా పనిచేసేవారు. అనువాద సినిమాలకు చాలా వేగంగా మాటలు, పాటలు రాసేవారు. ఆయన ఒకే రోజున 12 పాటలు రాశారంటే, పాటలను రాయడం ఆయనకి ఎంత తేలికైన పని అనేది అర్థం చేసుకోవచ్చు. ఆయన చూడటానికి పైకి చాలా సీరియస్ గా కనిపించేవారట. కానీ ఆయన చాలా చమత్కారి అని తోటి కవులు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మెరుపువేగంతో ఆయన వేసే పంచ్ నుంచి తేరుకోవడానికి ఎదుటివారికి చాలాసేపు పట్టేదని అంటారు.
డబ్బు విషయంలో ఎవరినీ డిమాండ్ చేయడం .. డబ్బును జాగ్రత్త చేసుకోవడం శ్రీశ్రీకి తెలియదని చెబుతుంటారు. అంతేకాకుండా సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేసిన కారణంగా ఆయన ఆస్తులు కరిగిపోయాయని చెబుతారు. ఆయన కూడా ఆర్థికపరమైన ఇబ్బందులను చూశారని అంటారు. ఏదేమైనా తెలుగు సాహిత్యాన్ని ఆయన ప్రభావితం చేసిన తీరు .. ఆయన సాగించిన అక్షర ప్రయాణం అనితరసాధ్యంగా నిలిచింది. ‘మహాకవి’ అనే బిరుదును ఆయనకి అప్పగించింది. అలాంటి శ్రీశ్రీ వర్ధంతి నేడు .. ఈ సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం! ఆయన కవితల ఒడిలో .. పాటల గుడిలో కాసేపు సేదదీరుదాం.
(శ్రీశ్రీ వర్ధంతి ప్రత్యేకం)
-పెద్దింటి గోపీకృష్ణ
Must Read : విజయానికి మరో పేరు .. వి.మధుసూదనరావు