సిఎం జగన్ పై అభిమానం కంటే వ్యక్తిగత అవసరాలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎక్కువయ్యాయని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శ్రీధర్ రెడ్డి డిసెంబర్ 25న చంద్రబాబుతో భేటీ అయ్యారని, అంతకుముందు నుంచే లోకేష్ తో టచ్ లో ఉన్నారని నాని వెల్లడించారు. అసలు ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు ఉంటుందని, కోటంరెడ్డి మాట్లాడినదాన్ని ఆయన మిత్రుడే రికార్డ్ చేసి పంపారని, దాన్ని ట్యాపింగ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఒక వీడియో సర్క్యులేట్ అవుతోందని, చెక్ చేసుకోవాలని మాత్రమే ఇంటలిజెన్స్ చీఫ్ శ్రీధర్ రెడ్డికి మెసేజ్ పంపి ఉంటారని నాని అభిప్రాయపడ్డారు.
కోటంరెడ్డిపై సిఎం జగన్ కు ప్రేమ ఉందని, కానీ అయన జగన్ కు నమ్మక ద్రోహం చేశారని పేర్ని ఆరోపించారు. పక్షులు వలస వెళ్ళినట్లు, ఎన్నికల సమయంలో నేతలు వలసలు వెళుతున్నారని, కొంతమంది ఒకచోట పనిచేస్తూ పక్క చూపులు చూస్తున్తారని విమర్శించారు. తాము ఈ విషయంలో సిఎం జగన్ కు ముందే చెబుతున్నా శ్రీధర్ పై ఉన్న ప్రేమ కారణంగా వాటిని నమ్మలేదని అన్నారు.
బ్లూకలర్ బెంజ్ కారులో ఓ సర్పంచ్ ను వెంటబెట్టుకొని బాబును కలిసి శ్రీధర్ రెడ్డి రెండు గంటలు చర్చించారని, యువ గళం పాదయాత్రపై లోకేష్ కు సలహాలు, సూచనలు కూడా ఇచ్చారని… ఈ విషయాలన్నీ టిడిపి నేతలే చెబుతున్నారని నాని పేర్కొన్నారు. శ్రీధర్ రెడ్డి ఆస్పత్రిలో ఉంటే లోకేష్ పరామర్శించారని, సంబంధం లేనప్పుడు ఎందుకు పరామర్శించాల్సి వచ్చిందని నాని నిలదీశారు. తాను కూడా ఆస్పత్రిలో ఉన్నానని, తనను ఎందుకు లోకేష్ పరామర్శ చేయలేదని… ఒకసారి ఆయన తన అంతరాత్మను ఓసారి ప్రశ్నించుకోవాలని హితవు పలికారు.