ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బాబు జనతా పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు బిజెపి నేతలు కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. నిన్న అమరావతి పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలను శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 23.02.2018న కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ బిజెపి డిక్లరేషన్ విడుదల చేసిన మాట వాస్తవం కాదా? అమరావతి స్కామ్ కాపిటల్ అని మీరు గతంలో చెప్పిన మాట మర్చిపోయారా అని ప్రశ్నించారు. సత్య కుమార్ అసత్య కుమార్ గా మారిపోయారన్నారు. అమరావతిలో ఇతనికి కూడా బినామీ భూములు ఉన్నాయని ఆరోపించారు. తన బినామీలకు అన్యాయం జరుగుతుందని అమరావతి రాజధానిపై చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని, ఆయనకు బిజెపిలో ఉన్న కొందరు నేతలు వంత పాడుతున్నారని విమర్శించారు.
అమరావతిలో శాసన రాజధాని ఉంచి, దేశంలోనే అత్యధిక జిడిపి ఉన్న 10నగరాల్లో ఒకటిగా ఉన్న విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సిఎం జగన్ నిర్ణయిస్తే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ అంశాలపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
రాయలసీమకు ఏమీ చేయలేదని సత్య చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీమకు న్యాయం జరిగితే అది నాడు వైఎస్, నేడు జగన్ హయాంలోనే అని స్పష్టం చేశారు. సిఎం జగన్ పై విమర్శలు చేస్తే ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతు విషయంలో సత్య చేసిన వ్యాఖ్యపై ఆ పార్టీ అధిష్టానం అక్షింతలు వేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
Also Read : మహానాడు కాదది బూతునాడు: శ్రీకాంత్ రెడ్డి