Saturday, January 18, 2025
HomeTrending Newsమీరు నొక్కుతున్న బటన్ బ్యాటరీ మోడీదే

మీరు నొక్కుతున్న బటన్ బ్యాటరీ మోడీదే

Button-Battery: ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వానికి దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఆమెపై సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. అనూహ్యమైన మెజార్టీతో ఆమె విజయం సాధించబోతున్నారని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. రేపు రాష్ట్రంలో పర్యటిస్తున్న ముర్ముకు ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. రాష్ట్రపతి కోటా నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురినీ దక్షిణాది రాష్ట్రాల నుంచే వారిని ఎంపిక చేయడం ఈ ప్రాంతానికి పంపడం బిజెపి ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందని జీవీఎల్ చెప్పారు.

బటన్ నొక్కి  నేరుగా డబ్బులు పంపుతున్నామని ప్లీనరీలో సిఎం జగన్ చెప్పారని, కానీ వారు నొక్కిన ప్రతి బటన్ వెనుకా బ్యాటరీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానిదేనని, ఈ విషయం చెప్పడం మర్చిపోయారని జీవీఎల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, విస్తృతంగా అందిస్తోన్న ఆర్ధిక సహాయం వల్లే ఇది సాధ్యమైందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. సిఎం బటన్ నొక్కినప్పుడల్లా లబ్ధిదారులు మోడీకి కూడా ధన్యవాదాలు తెలపాలని కోరారు.

రాష్ట్రంలో 86 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తోందని, 25 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటివరకూ అందజేసిందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ వరకూ  ఈ పథకాన్ని కేంద్రం పొడిగిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఏప్రిల్ నుంచి ఇవ్వడం లేదని,  మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఆలోచనతోనే ఈ పంపిణీ ఆపేశారని ఆయన ఆరోపించారు.  పైగా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.  లక్షా 20వేల టన్నుల బియ్యం ప్రతినెలా  అవసరం కాగా,  14 లక్షల టన్నుల బియ్యం గోదాముల్లో నిల్వ ఉందని అయినా సరే బియ్యం లేవని అబద్ధం చెప్పారని విస్మయం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరించి, రైతులకు డబ్బులు చెల్లించేది కేంద్రమేనని అయినా సరే రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు.  బియ్యం పంపిణీ నిలిపివేసినందుకు నిరసనగా ఈనెల 14న ప్రతి జిల్లా కేంద్రంలో బిజెపి ఆందోళనా కార్యక్రమాలు చేపడుతుందని ప్రకటించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై 18న అన్ని మండల కేంద్రంలోనూ ఉద్యమం చేస్తామన్నారు.

అంత్యోదయ  సిద్ధాంతాన్ని సూచించిన దీనదయాళ్ ఉపాధ్యాయ  జన్మదినం సెప్టెంబర్ 25 నుంచి  బిజెపి ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిన్నటి కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని జీవీఎల్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్