stealing goods up to $950 is not a crime in San Francisco :
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం. ప్రముఖ వాల్ గ్రీన్ రిటైల్ షాప్ లోకి ఓ ముసుగు చోరుడు వచ్చాడు. చక చకా తనకు కావలసిన వస్తువులు బ్యాగ్లో వేసుకున్నాడు. దర్జాగా వెళ్ళిపోయాడు. అతన్ని ఎవరూ అడ్డుకోలేదు.
అరవై నాలుగు కళల్లో చోర కళది ప్రత్యేకస్థానం. వ్యక్తుల స్థాయిని బట్టి చోరీచేసే విధానాలు మారతాయి. వ్యాపారస్తులు వస్తువుల రేట్లు పెంచి దర్జాగా చోరీ చేస్తారు. పేదవాడు కూటికి లేక దొంగిలిస్తాడు. ఒకరిది చట్టబద్ధం. మరొకరిది చట్ట విరుద్ధం. ప్రభుత్వాలు ఎడా పెడా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తాయి. ఏమీ అనలేం. దశాబ్దాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా సొంత ఇల్లు లేనివారు కోకొల్లలు. ఎన్ని శరణాలయాలున్నా రోడ్లపైనే శయనించే అనాథలెందరో! వీరిలో కడుపు మండినవారు దొంగతనం చేస్తే జైలే గతి. ఇదంతా మన దేశపు ముచ్చట. అమెరికాలో చట్టాలకు పదునెక్కువ. మానవత్వం కూడా ఎక్కువే.
శాన్ఫ్రాన్సిస్కో నగరం ఇందుకు ప్రధాన వేదిక. అక్కడ దొంగతనం 950 డాలర్ల లోపు అయితే శిక్ష ఉండదు. కేసే ఉండదు. అసలు నేరమే కాదు. 2014 లో చేసిన ప్రొపొజిషన్ 47 యాక్ట్ ప్రకారం ఇది సాధ్య పడుతోంది. దాంతో చలో సోదరా అంటూ దొంగలు ముసుగేసుకుని దర్జాగా వెళ్లి కావలసిన వస్తువులు బ్యాగ్ లో వేసుకుని సిబ్బందికి బై చెప్పి వెళ్తున్నారు. అక్కడి ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ గ్రీన్ షాపుల్లో గత నాలుగు నెలల్లో 18 దొంగతనాలు జరిగాయట. అయినా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో వాల్ గ్రీన్ సుమారు 17 షాపులు మూసేసిందట. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేదంటే ఇదేనేమో. చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఈ విషయమై అక్కడి చోర శిఖామణులు ఉద్యమం మొదలెట్టినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద చోర కళకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు శాన్ఫ్రాన్సిస్కో ప్రభుత్వాన్నీ అభినందించాలేమో!
-కె. శోభ