Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆధునిక స్టెరాయిడ్ భారతం!

ఆధునిక స్టెరాయిడ్ భారతం!

నేటి భారతంలో తరచుగా వినిపిస్తున్నమాట “మోతాదుకు మించి” అన్న మాట. ఒకప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తే తాహతుకు మించి అనేవారు.

ఇప్పుడో..కరోనా కాలం..అంతా వైద్యో నారాయణో హరి.. అందుబాటులో ఉన్న మందులన్నీ వాడేయడం…ఆనక మోతాదుకు మించి వాడద్దనడం.

మన చిన్నప్పుడు జలుబు చేస్తే ఆవిరి పట్టేవాళ్ళం. కడుపునొప్పికి వాము తినేవాళ్ళం. మన అమ్మమ్మలయితే జ్వరానికి శొంఠి కాషాయం తాగేవాళ్ళు. మరీ బాగాలేకపోతే ఏ ఆయుర్వేద ఆచారిగారినో హోమియో రావు గారినో అడిగి నాలుగు గుళికలు తీసుకునేవారు. ఇవన్నీ ఎప్పుడు ఆవిరి అయిపోయాయో?.. ప్రతిదానికీ డాక్టర్ సలహా అవసరమయిపోయింది.

గతంలో ప్రతిఇంట్లో పోపులడబ్బాయే మందుల గని. ఇప్పుడు మందులే ఇంటినిండా పోపుల డబ్బాలయి కూర్చున్నాయి.

ఎప్పుడైతే జలుబు,చిన్నపాటి జ్వరాలకు సైతం ఇంట్లో పెద్దవాళ్ళను కాకుండా డాక్టర్ ను సంప్రదించడం ప్రారంభించామో ఇమ్మ్యూనిటీ తగ్గిపోవడం మొదలయింది.

విటమిన్లు, మినరల్సు .. అన్నిటికీ మందులే. ఆహారం కన్నా మందులే ఎక్కువయ్యాయి. ఇలాంటప్పుడు కరోనా లాంటి అంతు తెలియని వ్యాధికి చికిత్స చేస్తామని వైద్యులు పూనుకున్నారు. తెలిసి తెలియక అందుబాటులో ఉన్న మందులన్నీ గుప్పించడం ప్రారంభించారు. ఒక పద్ధతంటూ లేని ఈ వైద్యం లక్షలాది ప్రాణాలను హరిస్తోంది. ఇవాళ వాడిన మందులు రేపు నిషేధం. ఒక్కో మందుతో అనేక సైడ్ ఎఫెక్ట్స్. ఎప్పుడు ఏ మందు వాడాలో తెలియదు. విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడకం. ఫలితం రంగురంగుల ఫంగస్ వ్యాధులు.. ఇప్పుడేమో మొదటివారం స్టెరాయిడ్స్ వాడద్దు అని ఎయిమ్స్ వైద్యుల ఉవాచ.

ఇంత జరుగుతున్నా దేశీ వైద్యం వైపు లేని చూపు..
ఏ ధన్వంతరి రావాలో… ఏ చరకుడు,
సుశ్రుతుడు సరిచేయాలో ఈ స్టెరాయిడ్ భారతాన్ని?

-కె . శోభశ్రీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్