రాజేంద్రప్రసాద్ ప్రధానమైన పాత్రను పోషించిన ‘అనుకోని ప్రయాణం’ ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమాకి, వెంకటేశ్ పెడరెడ్ల దర్శకత్వం వహించాడు. నరసింహారాజు .. ప్రేమ .. తులసి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నిన్న రాత్రి వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ..” ఇందాకటి నుంచి అంతా వయసు గురించి మాట్లాడుతున్నారు. మీరనుకున్నంత వయసు నాకేం లేదు. నా వయసుతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నా వయసు ఇంకా ముప్పై నాలుగు మాత్రమే అంటూ నవ్వేశారు.
“45 ఏళ్ల నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాను. చాలామంది కొత్త దర్శకులతో పనిచేశాను. ఒకప్పుడు నేను కూడా కొత్తవాడినే. కొత్తవాళ్ల దగ్గర కొత్త కథలు ఉంటాయి .. ఆ కథలను వాళ్లు మరింత కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తారని నమ్మేవాడిని నేను. అందువల్లనే ఈ సినిమాను చేశాను. దర్శకుడు వెంకటేశ్ కి నేనేదో అవకాశం ఇచ్చానని అంటున్నాడు. నిజానికి ఈ కథ వేరేవారికి వెళ్లిపోతుందేమోననే కంగారులో వెంటనే ఒప్పేసుకున్నాను .. ఆ విషయం ఆయనకి తెలియదు. కొత్త దర్శకుడే అయినా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా నీట్ గా చెప్పాడు. ఇండస్ట్రీకి ఇలాంటి దర్శకుల అవసరం ఉంది” అని అన్నారు.
‘అనుకోని ప్రయాణం‘ నా కెరియర్లో నేను ఎప్పటికీ మరిచిపోలేని సినిమా అవుతుందని చెప్పగలను. నా లైఫ్ లో నేను చేసిన అద్భుతమైన సినిమాలలో ఇది ఒకటి అని బలంగా నమ్ముతున్నాను. ‘ఆ నలుగురు’ తరహాలో కనెక్ట్ అయ్యే కథ ఇది. పడిపోతున్న మానవతా విలువలను నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నం చేసే కథ ఇది. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా రావు. మంచి సందేశంతో కూడిన ఇలాంటి కథలు రావడానికి కొన్నేళ్లు పడుతుంది. అద్భుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అలాంటి ఒక అద్భుతమే ‘అనుకోని ప్రయాణం’ అంటూ చెప్పుకొచ్చారు.