భక్తి ధూపం
పూలపై మంచు బిందువులు కిరణాల భవిష్యత్తును ప్రతిబింబిస్తాయి
దారం ఆధారంతో అందలం ఎక్కిన పూలు శ్రమను దాచేస్తాయి
గాలి పరిమళమై మనసులను దోచేస్తాయి
సమానత్వ స్వభావం నింపుకున్న పూలు అర్హతలు లేకున్నా అలంకరిస్తుంటాయి
కుమిలిపోతూనో కుళ్ళిపోతూనో అవసరం తీరాక విసిరేయడతాయి
ప్రకృతికి ఆత్మ.. ఆత్మ గౌరవం ఉందని
దైవత్వాన్ని దర్శించే శ్రమైక జీవన సౌందర్యం
మనిషికి ప్రకృతికి మర్చిపోలేని అనుబంధాన్ని పెనవేస్తుంది
చెట్టు పుట్టచెలకా సేద తీరని సేకరణలో
నిండిన పులగంపలోంచి జీవాత్మలు సంభాషిస్తుంటాయి
తాంబాలమంతా తానే తీర్చిన కళ్ళలోకి చూసి కలలుగంటది ఆత్మ
రైతుపంట పసుపు ముద్ద గౌరమ్మగా మారి
పసుపు కుంకాల సేవ చేసి భక్తి ధూపం వేస్తది
తీరు తీరు పూల రంగుల అద్దుకున్న చీరలు
ఒక్కొక్క పువ్వేసి సాంద మామ ఒక్క జాములాయే సాంద మామ అని
తన్మయత్వంతో పాడే పాటలకు చప్పట్లు తాళాలవుతాయి
వంద వసంతాలకు వేల కోకిలలు ఒక్కసారిగా కోరసిచ్చినట్లు పల్లె సంబుర పడుతది
రాగాల కంపనానికి రాళ్ల ఎదలు కరుగుతుంటాయి
బతుకమ్మ బతుకుమని శ్రమపాట సమానత్వాన్ని సంధిస్తుంది
బహుజనమంతా సమ్మోహనమవుతుంది
ఇంటికొక బతుకమ్మకు వీధి వీధి వేదిక
తారతమ్యం మరిచి నిరాకారులై ప్రకృతికి ప్రణమిల్లుతారు
డప్పు దరువులతో బతుకమ్మ ఊరికిరీటమై ఊరేగుతుంటది
పో పో బతుకమ్మ పోయి రావమ్మా అంటూ
పారే నీటి అలల మీద పాటలతో విరమించని గీతాన్ని ఆలపిస్తారు
మమతల సద్దులిప్పిన కాయకష్టం చేసిన చేతులు
బతుకమ్మ పలారమని నోటికో ముద్ద అందిస్తూ రేపటికి సిద్ధమవుతారు
-డా. సిద్దెంకి యాదగిరి